అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రకృతి అందాలు చూడాలంటే సాధారణంగా శీతాకాలం బెటర్ అనుకుంటారు. పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా ఆ టైమ్ లోనే వస్తూంటారు. కానీ నిజానికి అసలైన అందాలు రైనీ సీజన్ లోనే చూడవచ్చు. ప్రస్తుతం విస్తారంగా వానలు కురుస్తున్న వేళ అరకు అందాలు అదరహో అన్నట్లుగా ఉన్నాయి. దాంతో పర్యాటకులు ఆ వైపుగా దృష్టి సారిస్తున్నారు. అరకులో కురుస్తున్న భారీ వర్షాలకు మన్యం సౌందర్యం రెట్టింపు అయింది. అరకు ఘాటు రోడ్డులో రమణీయమైన దృశ్యాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఘాటు రోడ్డులో ఉన్న సుంకరిమెట్ట గాలికొండ దముకు ప్రాంతాంలో కాశ్మీర్ ని తలపించే సౌందర్యాలు ఇట్టే కట్టిపడేస్తున్నాయి అని అంటున్నారు.
నిజానికి ఆంధ్రా కాశ్మీరు అని పాడేరులోని లంబసింగి ప్రాంతాన్ని చెబుతారు. ఇపుడు అరకు అందాలను చూస్తే అదే మాట ఇక్కడా వాడాల్సి ఉంటుంది. దారి పొడవునా ప్రకృతి కుప్పపోసినట్లుగా కనిపించే సొగసులను కంటితో ఏరుకోవడమే పర్యాటకులు చేయాల్సిన పని. ఇక టూరిజం డిపార్ట్మెంట్ మరింత శ్రద్ధ వహించి అరకుని తీర్చిదిద్దితే రైనీ సీజన్ లో కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త ప్రాజెక్టులను టేకప్ చేయడం ద్వారా అరకు రమణీయతను రాష్ట్రం దేశం మొత్తం ఆకట్టుకునేలా చేయవచ్చు అంటున్నారు. ఎత్తయిన కొండల మధ్య కురుస్తున్న పొగమంచు, మేఘాలు భూమిని తాకుతున్నాయా అన్నట్టుగా కనువిందు చేస్తుంటే ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించే వారు అరకులోయ మంచు అందాలకు ముగ్ధులై పోతున్నారు. గజగజ వణికి పోయే చలిలోనూ సంతోషంతో తడిసి ముద్దవుతున్నారు. ఆంధ్రా ఊటీ అని పేరెన్నిక గన్న అరకులోయలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పడిపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయినప్పటికీ పర్యాటకులు మాత్రం ఈ సీజన్లో అరకు అందాలను చూడడానికి అరకుకు క్యూ కడుతున్నారు.
అరకులోయలో వేకువజామున దర్శనమిచ్చే మంచు మేఘాలు పాలసముద్రాన్ని తలపిస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయి. ఇక అరకులోయ సమీపంలో ఉన్న మాడగడ గ్రామం వద్ద ఎత్తయిన కొండల మధ్య కురుస్తున్న మంచు అద్భుత దృశ్యంగా కనువిందు చేస్తోంది. ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న కాశ్మీర్ కి వెళ్లే బదులు, అద్భుతమైన అరకు అందాన్ని చూస్తే చాలు అన్న భావన చాలామందికి కలుగుతుంది. ఇదిలా ఉంటే డుంబ్రిగూడ మండలం లోని వలిసె పూలు పర్యాటకులకు సాదర స్వాగతం పలుకుతున్నాయి. కేవలం శీతాకాలంలోనే పూసే ఈ పూలు అరకు కు వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం అరకు లోయ ప్రాంతం పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. బొర్రా గుహలు, తడి గూడా కటికి జలపాతంతో పాటు వివిధ సందర్శనా ప్రాంతాలను వీక్షించి పర్యాటకులు మరిచిపోలేని అనుభూతులను మూటగట్టుకుంటున్నారు. విశాఖ మన్యంలోని అందాలు, అక్కడి గిరిజనుల ఆచార వ్యవహారాలు, వారి నిష్కల్మషమైన మనస్తత్వం, వారు చేసే వంటలు ప్రతి ఒక్కటి అక్కడికి వెళ్ళిన పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.