మళ్లీ ప్రభుత్వోద్యోగులు మండిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఒకసారి కాదు రెండుసార్లు కాదు.. ఎన్నోసార్లు ప్రభుత్వం మోసం చేసిందని.. నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలకే దిక్కు లేదని వారంటున్నారు. ఇప్పటికే సీఎంను నమ్మి సమ్మె విరమించి.. ఒప్పందం చేసుకున్నందుకు.. ఉద్యోగుల ముందు చులకన అయిపోయామని ఉద్యోగుల సంఘాల నాయకులు అంటున్నారు. అసలు ప్రభుత్వ ఉద్యోగుల కన్నా టీచర్లే బీభత్సంగా ఉద్యమం చేసి ప్రభుత్వాన్ని దిగొచ్చేలా చేశారు. ఆ విషయం ప్రభుత్వం కూడా గుర్తించింది. అందుకే వారిపైన ఫోకస్ పెట్టారనే టాక్ కూడా ఉంది.జీతాలు టైముకి రావటం లేదు. ఏ ఎరియర్స్ అయినా సరే వాయిదాలే తప్ప అసలు ఇవ్వడం లేదు. పీఎఫ్ బకాయిలు చెల్లించడం లేదు. డీఏ బకాయిలు చెల్లించడం లేదు. పైగా ఉద్యోగుల పీఎఫ్ అమౌంట్లపై లోన్లు కూడా ప్రభుత్వం తీసుకుందనే ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల ముందు సీపీఎస్ వారంలోపు రద్దు చేస్తామని చెప్పి.. ఇప్పుడు ఆ సీపీఎస్ అమలు చేస్తున్నందుకు కేంద్రం నుంచి ఇన్సెంటివ్ లోన్ తీసుకున్నారు. దీంతో ఉద్యోగులకు ఏం చెప్పుకోవాలో అర్ధం కాని పరిస్ధితిలో సంఘాల నాయకులు పడిపోయారు. ఆందోళన నిర్వహించకపోతే ఉద్యోగులు కొడతారేమోనన్న భయంలో ఉద్యోగసంఘాల నాయకులు ఉన్నారు.అయితే ప్రభుత్వ వాదన మరోలా ఉంది. ఆర్ధిక పరిస్ధితి ఎంత టైటుగా ఉందో అందరికీ తెలుసు.. అలాగే ప్రజల అవసరాలు తీర్చడం ముందు ముఖ్యం.. అలాగే ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆర్ధిక పరిస్థితులను గమనించి ఉద్యోగులు ఓపిక పట్టాలని.. అన్నీ నెరవేరుస్తామని ప్రభుత్వ పెద్దలు హామీ ఇస్తున్నారు.
కాని ఉద్యోగులు మాత్రం ఫైరవుతున్నారు. కుప్పం వెళ్లి 65 కోట్లు ఇస్తాను.. ఎమ్మెల్యేల సమావేశం పెట్టి నియోజకవర్గానికి 2 కోట్లు ఇస్తాను.. మీరు బాగా పని చేయాలి.. మళ్లీ గెలవాలి, 175కు 175 గెలవాలని చెబుతున్న సీఎంకు.. ఎన్నికల్లో గెలవటమే.. అధికారంలో ఉండటమే ముఖ్యమా… ఎన్నికలకు సంబంధం లేని ఏ వ్యవహారానికి ఈ ప్రభుత్వం నిధులే కేటాయించడం లేదు. మేం పని చేయకపోతే.. మీరు ప్రజలకు సమాదానం చెప్పుకోగలరా.. పథకాలు అమలవుతాయా.. అవన్నీ వదిలేసి.. మా అవసరాలను మాత్రం ఆఖరి ప్రాధాన్యతగా చూడటం ఎలా సబబు అంటూ ఉద్యోగులు నిలదీస్తున్నారు.వైసీపీ నేతలు కూడా ఏదో ఒక విధంగా ప్రభుత్వోద్యోగులను కన్విన్స్ చేయాలని.. లేదంటే ప్రమాదమని చెప్పుకుంటున్నారు. సీఎం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలంటున్నారు. గతంలో సమ్మె జరిగినప్పుడు పోలీసులు ఏమీ చేయలేకపోయారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అంతే కాకుండా ప్రభుత్వోద్యోగులకు కోపం తెప్పించిన ఏ పార్టీ మళ్లీ గెలవలేదని.. అలాంటి పరిస్థితి మనకు వద్దని వారంతా హెచ్చరిస్తున్నారు. కాని ప్రభుత్వోద్యోగుల ఆందోళన తప్పేటట్టు లేదు.. సమ్మె జరగక తప్పేటట్లు లేదు.