జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య స్వగ్రామమైన కృష్ణా జిల్లా భట్లపెనుమర్రుకి ఇన్నేళ్లకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా పింగళి పేరిట ఢిల్లీలో మంగళవారం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. పింగళి కుటుంబీకులతోపాటు గ్రామస్థులనూ ఆహ్వానించేందుకు ప్రధాని దూతగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్వయంగా భట్లపెనుమర్రు వచ్చారు. పంద్రాగస్టు రోజున ప్రతి ఇంట పింగళి రూపుదిద్దిన మువ్వెన్నెల జెండా రెపరెపలాడనుందని.. పింగళి స్మారక తపాలా బిళ్లనూ విడుదల చేయడంతోపాటు గ్రామాభివృద్ధికి చొరవ తీసుకుంటామని.. ఏడాదంతా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని కేంద్రం పేర్కొంది. భారతరత్న ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ప్రకటించింది.
త్రివర్ణ పతాక రూపకర్త.. స్వతంత్ర భారత స్ఫూర్తికి నిదర్శనం పింగళి వెంకయ్య
“ఏకైక జాతీయ పతాకం కోసం తాము సర్వస్వం త్యాగం చేయడానికి సంసిద్ధులై ఉండాలన్న విషయాన్ని మనం విస్మరించకుండా ఉండటం ఎంతో అవసరం. ఇతర జాతులకుండే పతాకాల ఉద్దేశాలను, ఆశయాలను వర్ణిస్తూ, 30 రకాల జెండాలతో పింగళి వెంకయ్య అమూల్యమైన పుస్తకాన్ని భారత ప్రజలకు అందజేశారు. వీరు బందరు ఆంధ్రజాతీయ కళాశాలలో ఉంటూ, కొన్ని సంవత్సరాల నుంచి జాతీయ పతాక ఆవశ్యకతను గూర్చి ఎంతో ఉత్సాహంతోనూ, పట్టుదలతోను పని చేస్తున్నారు. 1921లో బెజవాడలో జరిగిన జాతీయ మహాసభలో వెంకయ్యను పిలిచి ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులు కలిపి, మధ్య రాట్నం చిహ్నంగా గల నిరాడంబరమైన జెండాను ఒకటి చిత్రించి ఇవ్వమని అడిగాను. వారి అకుంఠిత ఉత్సాహ ఫలితమే నేడు మనకున్న త్రివర్ణ పతాకం.*
బాపూజీ 1921లో రాసిన ఈ వ్యాఖ్యలు
త్రివర్ణ పతాకం ఆంధ్రదేశంలోనే పుట్టిందని, మన జాతికొక ప్రత్యేక పతాకం కావాలన్న ఆలోచన తెలుగు వారికి కలిగిందనే విషయాన్ని సుస్పష్టంగా తెలియజేస్తోంది. ఇది యావత్తు తెలుగు జాతికే గర్వకారణం. భారత జాతీయ జెండా రూపశిల్పి ) పింగళి వెంకయ్య కృష్ణా జిల్లా వాసి. ఆయన భట్లపెనుమర్రు గ్రామంలో 1876 ఆగస్టు రెండో తేదీన హనుమంతరాయుడు, వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించారు. ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేసిన అనంతరం కొలంబో వెళ్లారు. లాహోర్‌లోని ఆంగ్లో వేద పాఠశాలలో సంస్కృత, ఉర్దూ, జపనీస్ భాషలు అభ్యసించారు. ఆయన భాషావేత్త, భూవిజ్ఞాన శాస్త్రవేత్త, రచయితగా బహుముఖ ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించేవారు. 1913లో ఆయన జపనీస్ భాషలో పూర్తి నిడివితో ప్రసంగించి అందరి ప్రశంసలందుకున్నారు. అందుకే ఆయనను జపాన్ వెంకయ్య, పత్తి వెంకయ్య అనే పేర్లతో పిలిచేవారు.
19 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడే పింగళి వెంకయ్య ఆఫ్రికాలో మహాత్మాగాంధీని తొలిసారి కలిశారు. అప్పటినుంచి 50 ఏళ్లపాటు వారి అనుబంధం కొనసాగింది. 1918-1921 మధ్య జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొని భారతీయులకు సొంత జెండా ఉండాల్సిన ఆవశ్యకతపై వెంకయ్య ప్రస్తావించారు. అప్పటికి ఆయన మచిలీపట్నంలోని ఆంధ్ర నేషనల్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. మరోసారి విజయవాడలో గాంధీని కలిసినప్పుడు తాను రూపొందించిన జాతీయ జెండాను వివిధ డిజైన్లలో చూపించారు. జాతీయజెండా తొలిసారి విజయవాడలోనే రెపరెపలాడింది. ఆ తర్వాత 1947 జూలై 22న భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ మధ్యనున్న తెలుపు రంగులోని రాట్నాన్ని తీసేసి దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా జెండా వెలువరించారు. ఒక్క చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు..నేటి జెండాకు తేడా లేదు. దేశానికి ఎన్నో రకాలుగా సేవలు చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి పింగళి వెంకయ్యకి స్వాతంత్య్రం అనంతరం తగిన ఆదరణ లభించలేదు. వృద్ధాప్యంలో తినడానికి తిండి లేకుండా పేదరికం అనుభవించి జూలై 4 వ తేదీ 1963లో మరణించారు. “నా అంత్యదశ సమీపించింది. నేను చనిపోయిన తరువాత త్రివర్ణ పతాకంతో నా శరీరాన్ని కప్పండి’’ అని కన్నుమూసే ముందు వెంకయ్య తన చివరి కోరికను వెల్లడించారు. 2009లో ఆయన జ్ఞాపకార్థం తపాలా బిళ్లను విడుదల చేశారు. ఇన్నేళ్లకు పింగళి పుట్టిన ఊరికి, అతని కుటుంబానికి తెలుగు రాష్ట్రంలోనే కాకుండా యావత్ దేశం గుర్తుంచుకునేలా కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేక చొరవ తీసుకుంది.