ఆరు దశాబ్దాల పాటు ఒక రాజవంశం తరహా కాంగ్రెస్ పాలన, రాజకీయాలు, దాని రంగురంగుల సంకీర్ణ-అవినీతిలో విసిగిపోయిన దేశం, ఎనిమిది సంవత్సరాల క్రితం 2014లో నరేంద్ర మోడీని భారత ప్రధానిగా నియమించింది. ఆయన ప్రజలకు పరిపాలనలో అనుకూల మార్పును చూపుతానని, సుపరిపాలనకై కొత్త దిశా నిర్దేశం చేస్తానని మాటిచ్చారు. గత 8 సంవత్సరాలు ఆయన తన మాట నిలబెట్టుకుంటూ నూతన భారతాన్ని నిర్మించడంలో స్థిరంగా, బలంగా పురోగమిస్తూనే ఉన్నారు.
2014కి ముందు, భారతదేశంపై ప్రపంచ దృక్పథం కేవలం పెద్ద మార్కెట్ అవకాశం అని మాత్రమే. పాలనాలోపాలు, అవినీతి, బంధుప్రీతి, విధాన అస్థిరత, అక్కరకు రాని అధికారదర్పాలు, క్రోనీ క్యాపిటలిజం, కుంభకోణాల చుట్టూ అల్లుకున్న వాస్తవాలతో ఈ అభిప్రాయం ఏర్పడింది. ఢిల్లీ నుంచి వెచ్చించే ప్రతి ఒక్క రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే పౌరులకు చేరుతుందని 80వ దశకంలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ అంగీకరించినప్పుడు ఈ పరిస్థితిని దేశం తప్పక స్వీకరించాల్సి వచ్చింది.
మోడీకి ముందు భారతదేశంలో, రాజకీయంగా అనుసంధానమైన కొన్ని కుటుంబాలు, సమూహాలు అన్ని అవకాశాలను, వ్యాపారావసర మూలధనాన్ని ప్రజలకు అందుబాటులో లేకుండా చేశాయి. గత నాయకులంతా అవకాశాలను, పురోగతిని కోరుకునే అత్యధిక భారతీయుల ఆకాంక్షలను విస్మరించారు. ఉదాహరణకు భారతదేశ మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ నికర విలువలో 98% భారతదేశంలోని 10 ధనిక కుటుంబాల ఆధీనంలో ఉందని, ‘హౌస్ ఆఫ్ డెట్’ పేరుతో ప్రపంచ పెట్టుబడి బ్యాంకు, ఆర్థిక సేవల సంస్థ అయిన ‘క్రెడిట్ సూయిస్సే’ నివేదిక వెల్లడించింది. ఆ కాలంలో పారిశ్రామికాభివృద్ధి, అంకుర పరిశ్రమలు వృద్ధి చెందడం సాధారణ విషయం కాదు. అలా జరిగినా అవి అతి అరుదైన సందర్భాల్లో మాత్రమే.
ఆనాడు భారతదేశం ‘అసమర్థమైనది’ అన్న అభిప్రాయానికి అనుగుణంగా – పెద్ద ఆకారంతో , నెమ్మదిగా కదులుతున్న ఏనుగుతో పోల్చేవారు. ప్రపంచంలోని ఇతర ప్రధాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే పన్ను వసూళ్లు ద్వారా మన దేశ ఆదాయం తక్కువగా ఉండడమే కాక, మన పన్ను స్థూల జాతీయోత్పత్తి నిష్పత్తి – మరీ అధ్వాన్నంగా ఉండేది.
2004-14 ల మధ్య కోల్పోయిన దశాబ్దాన్ని భర్తీ చేయడానికి అన్నట్టుగా 2014 లో భారతదేశ పౌరులు పాలనలో మార్పు కోరి ఓటు వేశారు, పేద కుటుంబం నుంచి వచ్చి గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా అతని కృషి, సేవకు తగిన గుర్తింపుగా ప్రజలు నరేంద్ర మోడీకి అద్భుతమైన మద్దతు ఇచ్చారు – గుజరాత్‌లో ఆయన సబర్మతీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ వంటి దీర్ఘకాలిక ప్రాజెక్టులకు మొగ్గు చూపడం ద్వారా స్వల్పకాలంలో ప్రజాకర్షణ పొందడం కంటే మధ్యస్థ, దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి సారించడం వంటి రాజకీయ, పాలనా ఆలోచనలో వ్యత్యాసాన్ని ఆయన ఇదివరకే ప్రదర్శించారు. 2014లో లభించిన మద్దతు, ప్రజామోదాన్ని మించి 2019 లో మరిన్ని వరుస విజయాలు అందుకున్నారు.
మొదటి 3-4 సంవత్సరాల పాలనా కాలంలో ఆర్థిక వ్యవస్థ లోటుపాట్లను, నష్టాలను పరిష్కరించడంలో, పౌరులు పాలనా సంస్థల పై, ప్రభుత్వం పై కోల్పోయిన నమ్మకాన్ని పునర్నిర్మించడంలో ఆయన సమయం వెచ్చించారు. అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్, ఆర్థిక రంగం, స్పందించలేని, పాతబడిన ప్రభుత్వ యంత్రాంగాల్ని అధికార బదలాయింపులో ప్రతిగా పొందారు. క్రమంగా ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక రంగాలపై, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని, ప్రభుత్వం పై నమ్మకాన్ని స్థిరంగా పునర్నిర్మించారు. ప్రభుత్వంలోని పని సంస్కృతిని మార్చడమే కాకుండా ప్రభుత్వాన్ని భారతీయుల శ్రేయస్సు కోసం కృషి చేసే అవిశ్రాంత పనిముట్టుగా, లక్ష్య సాధనంగా మార్చారు.
లెక్కలేనన్ని సంస్కరణలు, సమర్ధ పాలనా కార్యక్రమాలు భారతదేశాన్ని సుస్థిర స్థితిలోకి విజయవంతంగా నడిపించాయి. ముందుచూపుతో నూతన సాంకేతికత పట్ల ఆయన ప్రదర్శించిన నిబద్ధత, దేశ, దేశీయుల అవకాశాల గురించి ఆయనకున్న దార్శనికత, లోతైన ఆలోచనకి నిదర్శనమే ప్రధాని మోదీ ప్రారంభించిన డిజిటల్ ఇండియా కార్యక్రమం.
డిజిటల్ ఇండియా కార్యక్రమం మూడు స్పష్టమైన లక్ష్యాలతో ప్రారంభమైంది. మొదటిది, అతి ముఖ్యమైనది; పౌరుల జీవితాలలో సకారాత్మక మార్పు, సుపరిపాలన, ప్రజాస్వామ్య నిబద్ధత. రెండవది డిజిటల్ ఎకానమీ, ఉద్యోగాలు, అవకాశాలు, పెట్టుబడులను విస్తరించడం. మూడవది భవిష్యత్తులో సాంకేతికతలో అగ్రగామిగా ఎదగడం. అంటే భవిష్యత్తులో టెక్నాలజీల వినియోగదారు కాకుండా ప్రపంచానికే నాయకత్వం వహించడం.
డిజిటల్ ఇండియా పనితీరు, పైన పేర్కొన్న లక్ష్యాల నివేదికగా సాధించిన పురోగతిని చూపుతుంది. ఉదాహరణకి ఢిల్లీ నుంచి విడుదలయ్యే ప్రతి రూపాయి ఎలాంటి జాప్యం లేదా అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి చేరుతోంది. ప్రభుత్వం ఇప్పటివరకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ- DBT ద్వారా రూ. 17 లక్షల కోట్లకు పైగా బదిలీ చేసింది. తద్వారా రూ. 2.2 లక్షల కోట్లు ఆదా అయ్యింది. దీనివల్ల గత ప్రభుత్వాల పనితీరు, అవి అవలంబించిన పద్ధతులు లోపభూయిష్టమైనవిగా, పనికిరానివిగా నిరూపణ అయ్యాయి.
నేడు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అత్యంత శక్తివంతమైన అంకుర వ్యాపార వ్యవస్థను కలిగి ఉంది. వారంవారం నమోదవుతున్న దాదాపు 70,000 కొత్త పరిశ్రమల్లోంచి 100 వరకు నూతన దిగ్గజ సంస్థలు గా ఎదుగుతున్నాయి.
వీటి వృద్ధి పథం ప్రధానమంత్రి కృషి, వారి అభిరుచి, ఆవిష్కరణల సామర్థ్యం, మూలధన లభ్యత, సౌకర్య కల్పనల ద్వారా సాధ్యమైంది, రాజకీయ సంబంధాలు/కుటుంబ నేపథ్యం ద్వారా కాకుండా ఎంపిక చేసిన కొంతమందికి మాత్రమే అవకాశాల కేంద్రీకరణ జరిగే విధానాన్ని మార్చి అభివృద్ధి అర్ధాన్ని తిరగరాసింది.
–
కోవిడ్ పై అలుపెరగని పోరాటం లో డిజిటల్ ఇండియా ముఖ్యమైన పాత్ర పోషించింది. దేశంలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం చేరువయ్యేలా ఇది సహాయపడుతోంది. ఆరోగ్యం, విద్య, ఇతర ముఖ్యమైన సేవలు ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా వేగంగా అందుబాటులోకి వచ్చాయి . కోవిడ్ తర్వాత, భారతదేశం ఒక స్థిర ఆర్థిక వ్యవస్థ, పౌరసత్వం, పాలన కోసం సాంకేతికతను ఉపయోగించడంలో అత్యున్నత దేశంగా ఉద్భవించింది అని చెప్పడంలో మాత్రం అతిశయోక్తి లేదు.
డిజిటల్ ఇండియా – ఉత్పత్తులు, సేవలు ద్వారా భారతదేశ యువతకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. రాబోయే దశాబ్దాన్ని నవ భారత దశాబ్దం అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. గత 8 సంవత్సరాల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం అంకితభావంతో చేసిన కృషి ఫలితంగా భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా భారత యువత, వారి అంకుర పరిశ్రమలు అవకాశాలు పొందుతున్నాయి, ఇది మనందరి కృషి ఫలితం.