1998 డీఎస్సీ క్వాలిఫై అభ్యర్థులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని గ్రామస్తులు తెలపడంతో ఆయన చాలా ఆశ్చర్యపోయారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అల్లక కేదారేశ్వరరావు భిక్షాటన చేస్తూ జీవితంపై తీవ్ర నిరాశతో ఉన్న సమయంలో ఉద్యోగాలపై సీఎం ప్రకటన రావడంతో ఎలా స్పందించాలో కూడా ఆయనకు అర్థం కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యక్తి పేరు అల్లక కేదారేశ్వరరావు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన ఈయన చేనేత కార్మికుల కుటుంబంలో జన్మించారు. చాలా ఏళ్ల కిందటే డిగ్రీ పూర్తి చేశారు. టీచర్ కావాలన్న లక్ష్యంతో అన్నా మలై విశ్వవిద్యాలయం నుంచి బీఈడీ కూడా చేశారు. 1994 డీఎస్సీలో కొన్ని మార్కుల తేడాతో జాబ్ రాలేదు. అయినా నిరుత్సాహపడకుండా 1998లో డీఎస్సీ రాశారు. క్వాలిఫై అయినా రిక్రూట్మెంట్ వివాదం కోర్టుకు చేరడంతో అభ్యర్థుల ఎంపిక నిలిచిపోయింది. ఏళ్లు గడిచినా ప్రయోజనం లేకపోయంది. కానీ తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయంతో ఆశలు చిగురించాయి.
1994లో రావాల్సిన ఉద్యోగం, 1996లో కూడా పాసైనట్లు కేదారేశ్వరరావు తెలిపారు. 10 శాతం రిజర్వేషన్ అమలుచేయకపోవడం వల్ల జాబ్ రాలేదన్నారు. అయితే 1998లో క్వాలిఫై అయ్యానని, ఇన్నేళ్ల తరువాత ఉద్యోగం వచ్చిందని చెప్పారు. చంద్రబాబు వేసిన ఉద్యోగాలు అని, కానీ ఆయన హయాంలో ఇవ్వలేదని, ఇన్నేళ్ల తరువాత కనికరం పుట్టిందన్నారు. తన వద్ద సెల్ ఫోన్ లేదని, తనకు సమాచారం ఇంకా అందలేదని చెప్పారు. ఆయనకు చదువంటే ఇష్టం. చదువు చెప్పడం అంటే చాలా ఇష్టం. కానీ కాలం కలిసి రాకపోవడంతో దుర్భర స్థితిలో జీవితాన్ని నెట్టుకొస్టున్నారు. కానీ దాదాపు పాతికేళ్లకు ఉద్యోగానికి ఎంపికయ్యారు. కానీ ఈ వయసులో టీచర్ జాబ్ ఎవరెవరికి ఇస్తారు, ప్రభుత్వం తుది నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. డీఎస్సీలో క్వాలిఫై అయినా కోర్టు వివాదాలతో ఫలితాల ప్రకటన వాయిదా పడటంతో ఆశలు వదులుకున్నారు. కుటుంబాన్ని పోషించేందుకు దుస్తులు విక్రయించారు. ఆపై ఆటో నడుపుతూ జీవనం సాగించారు కేదారేశ్వరరావు. ఇవేమీ కలిసి రాకపోవడంతో ఉపాధి నిమిత్తం పదేళ్ల కిందట తల్లితో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయారు. కొద్ది రోజులకు కన్నతల్లీ అదృశ్యమైంది. దీంతో ఒంటరిగా తిరిగి గ్రామానికి చేరుకుని దీనస్థితిలో జీవనం కొనసాగిస్తున్నారు.