కమలం కన్ను మళ్లీ చంద్రబాబుపై పడిందా ? జగన్ తో వర్కవుట్ అవదనుకుని.. పవన్ చెప్పినట్లే టీడీపీతో కలుద్దామని అనుకుంటున్నారా ? రెండు రోజులుగా ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. చంద్రబాబుతో ఇప్పటికే చర్చలు మొదలెట్టారని కూడా టాక్ నడుస్తోంది. మరోవైపు అమరావతి సభలో బిజెపి నేతలు బీభత్సంగా వైసీపీపై విరుచుకుపడ్డారు. దీంతో ఈ టాక్ నిజమేనా అనే అనుమానం మొదలైంది. అదే జరిగితే బిజెపి, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే ఛాన్స్ ఉంది. అసలు వ్యవహారం ఇక్కడిదాకా రావడానికి కారణాలేంటి ?
ముందు ఒకరిని దెబ్బ తీయాలి. అందుకు అవసరమైతే మరొకరికి సాయం చేయాలి. ఆ మరొకరిని తర్వాత దెబ్బ కొట్టాలి. చివరకు రాష్ట్రం మన చేతికి రావాలి. అదీ లెక్క.. కమలం లెక్క. రాష్ట్రం విడిపోయినప్పుడు 2014లో గెలవడానికి కావాల్సినన్ని చెప్పారు. కాని తర్వాత చంద్రబాబునాయుడు సంగతి తెలుసు కాబట్టి.. ఇస్తున్నట్లే నటిస్తూ.. చేతులు వెనక్కు లాక్కున్నారు. విభజన చట్టంలో ఉన్న సంస్థలను ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలెట్టి.. చూసుకోండి ఎంత ఇస్తున్నామో అన్నారు. ఎలాగోలా తెచ్చుకుందామని చంద్రబాబు ట్రై చేశారు. కాని ఈలోపు జగన్.. బాబు అడగలేడు.. ప్రశ్నించలేడు.. ఓటుకు నోటు కేసుకు భయపడి లొంగిపోయాడంటూ అటాక్ స్టార్ట్ చేశారు. దీంతో బిజెపిని నమ్ముకుంటే.. ప్రజలు తనను కూడా ఓడిస్తారని భయపడ్డ చంద్రబాబు.. బిజెపిని వ్యతిరేకించడం మొదలెట్టారు. దీంతో బిజెపి వైసీపీకి దగ్గరైంది. ఎన్నికలప్పుడు వారికి అన్ని విధాలా సహకరించింది.. చంద్రబాబు ఓడిపోవడంతో లక్ష్యం నెరవేరిందని సంబరపడ్డారు.
ఇప్పుడు జగన్ పాలనపై వ్యతిరేకత వస్తుందని భయపడుతున్నారు. పవన్ చెప్పినా వినకుండా.. వైసీపీతోనే వెళ్లాలని రాష్ట్ర నేతలు ఫిక్స్ అయ్యారు. అందుకే ముందు సీఎం అభ్యర్ధి పవన్ అని చెప్పి.. తర్వాత ఇప్పుడు చెప్పలేమన్నారు. టీడీపీ కలవడానికి సిద్ధమైనా.. ససేమిరా అన్నారు. కాని ఇఫ్పుడిప్పుడే కమలనాథులకు ఏపీలోని వాస్తవ పరిస్ధితులు అర్ధమవుతున్నట్లున్నాయని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే హోదా ఇవ్వలేదు.. పోలవరం నిధులు ఇవ్వలేదు వంటి వాటితో ఏపీలో వ్యతిరేకత పెరిగింది. ఇప్పుడు వ్యతిరేకత పెంచుకున్న జగన్ తో ప్రయాణం చేస్తే.. ఇంకా వెనకబడిపోతామని.. ఇక్కడ ఎదగటం అనేది ఎప్పటికో అన్నట్లు అయిపోతుందనే ఆందోళన మొదలైంది. అందుకే మళ్లీ రూటు మార్చుకున్న బిజెపి… ఇఫ్పుడు జగన్ ను పక్కన పెట్టి.. టీడీపీ, జనసేనలతో ఈసారి ఎన్నికల్లో జర్నీ చేయాలని అనుకుంటుందని చెప్పుకుంటున్నారు.
ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని.. చర్చలు జరిగాయని చెప్పుకుంటున్నారు. మరి ఇది నిజమైతే మూడు పార్టీల్లోనూ జోష్ పెరిగే ఛాన్స్ ఉంది. అసలు టీడీపీ, జనసేన కలిస్తేనే వైసీపీ కష్టమనుకుంటుంటే.. బిజెపి కూడా కలిస్తే.. ఓట్లు పెరగకపోయినా.. పోల్ మేనేజ్ మెంట్ లో ఇబ్బంది లేకుండా ఉంటుందని అనుకుంటున్నారు. అయితే ప్రత్యేక హోదా, పోలవరం, స్టీల్ ప్లాంట్ వంటివాటిపై బిజెపి ఏమని చెబుతుందో.. మిత్రపక్షాలుగా వెళ్లాలనుకుంటే టీడీపీ, జనసేన ఏం చెప్పిస్తాయో చూడాలి.