78.30 శాతం ఉత్తీర్ణతతో ప్రకాశం జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. కొద్దిసేపటి క్రితం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 78.30 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రకాశం జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలో ఎస్.ఎస్.సి. పరీక్షా ఫలితాలను మంత్రి విడుదల చేసారు. రాష్ట్రంలో 6 లక్షల 15 వేల 908 మంది పరీక్షకు హాజరు కాగా వారిలో 67.26% తో 4 లక్షల 14 వేల 281 మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి అన్నారు. వారిలో 64.02% బాలురు కాగా మిగిలిన 70.70% బాలికలు ఉత్తీర్ణులైనారని మంత్రి అన్నారు. ఈ సంవత్సరం 797 పాఠశాలల్లో నూరు శాతం పరీక్షా ఫలితాలు సాధించామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ గురుకుల పాఠశాలలు 91.10% తో ఉత్తీర్ణతలో రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలిచాయని మంత్రి అన్నారు. ఒక్క విద్యార్థి కూడా పాస్ కాని పాఠశాలలు 71 కాగా వాటిలో 13 ప్రైవేట్ పాఠశాలలు 18 జిల్లా పరిషత్ పాఠశాలలు, 18 ఎయిడెడ్ పాఠశాలలు, 2 గవర్నమెంట్ పాఠశాలలు, ట్రైబల్ పాఠశాల ఒకటి, ఆశ్రమ పాఠశాల ఒకటి ఉన్నాయని మంత్రి వివరించారు.
పరీక్షలో ఉత్తీర్ణత తగ్గడానికి కారణాలు ప్రభుత్వం విశ్లేషిస్తుందని కోవిడ్ తరువాత కూడా సరిగా పాఠశాలలను నడపక పోవడం వల్లే ఈసారి ఉత్తీర్ణతా శాతం తగ్గిందని మంత్రి తెలిపారు. విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు కల్పించడమే ప్రభుత్వ ద్యేయమని, ఈదిశగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 28 రోజులలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేశామని విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడాలని మంత్రి అన్నారు.
ఏప్రిల్ 27వ తేదీ నుండి మే 9వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించామని మే 13 నుండి 22 వరకు స్పాట్ వాల్యూయేషన్ చేశామని మొత్తం 6,15,908 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 4,14,281 మంది ఉత్తీర్ణత సాధించారని వారిలో 2,02,821 మంది బాలురు, 2,11,460 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారన్నారు. మొత్తం 11,671 మంది పాఠశాలల విద్యార్థులు పరీక్షలు వ్రాయగా 797 పాఠశాలలలో 100% ఉత్తీర్ణత సాధించారని మంత్రి అన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థుల కొరకు జులై 6 నుండి 15వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారని, ఇందుకు సంబంధించి ఈ నెల 13 నుండి ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు జూన్ 7వ తేదీ నుండి ఫీజు చెల్లింపులు ప్రారంభమవుతున్నాయని పరీక్షల అనంతరం ఫలితాలు త్వరగా విడుదల చేసి రెగ్యులర్ విద్యార్థులతో పాటు సప్లిమెంటరీ విద్యార్థులకు కూడా చదువుకునే అవకాశం కల్పిస్తామన్నారు.
మార్కుల జాబితాలలో గ్రేడింగ్ లేదని, మార్కుల జాబితాలు ప్రధమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, పాస్ మార్కులు అందిస్తారని మంత్రి అన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలపై ఎవరూ ప్రకటనలు ఇవ్వరాదని, విద్యను విద్య లాగే కొనసాగించాలని, వ్యాపారం చేయకూడదని మంత్రి అన్నారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే సమాధాన పత్రాలు ఇస్తామని, రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం 15 రోజుల లోపుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. గడువు తేదీ కంటే ముందే పాఠశాలలు తెరిచినా, తరగతులు ప్రారంభించినా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. పరీక్షలలో మాల్ ప్రాక్టీస్ వ్యవహారంపై 80 మందిని కస్టడీ లోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. .
పదో తరగతి ఫలితాలలో అమ్మాయిలు సత్తా చాటారు
పదో తరగతి ఫలితాలలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్న శశి విద్యాసంస్థలకు చెందిన ఇద్దరు విద్యార్థినిలు ప్రతిభ కనబర్చారు. చిట్టాల హరి సాత్విక అనే విద్యార్థిని 600 మార్కులకు గాను 598 మార్కులు సాధించి తన సత్తా చాటింది. ఇంగ్లీష్, సైన్స్, గణితం, తెలుగు సబ్జెక్టుల్లో నూటికి నూరుశాతం మార్కులు సాధించగా.. హిందీ, సోషల్ సబ్జెక్ట్లో 99 మార్కులు సంపాదించింది. తల్లిదండ్రులు విజయ కుమారి, సాయికుమార్లు వృత్తిరీత్యా ప్రైవేట్ పాఠశాల కళాశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ.. తాడేపల్లిగూడెంలో నివాసముంటున్నారు. ఐఐఐటీ ధ్యేయంగా కృషి చేస్తానని హరి సాత్విక తెలిపింది.
విశాఖ జిల్లాలోని సంగివలస క్యాంపస్లో బోయిన శ్రీవల్లి అనే విద్యార్థిని 600 మార్కులకుగాను 592 మార్కులు సాధించింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే అత్యధిక ప్రతిభ కనపరిచినట్లు తెలిపింది. భవిష్యత్తులో బైపీసీలో చేరి మంచి డాక్టర్ కావాలన్నదే తన లక్ష్యమని చెప్పింది. తన ఉపాధ్యాయుల శ్రద్ధ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే పదో తరగతి పరీక్షలలో 596 మార్కులు సాధించగలిగినట్లు విశాఖకు చెందిన కీర్తిరెడ్డి చెప్పింది. విశాఖలోని శ్రీచైతన్యలో విద్యను అభ్యసించినట్లు వివరించింది. తండ్రి సాధారణ మెకానిక్, తల్లి అనిత గృహిణి. ఐఏఎస్ చదవాలన్నది తన లక్ష్యమని తెలిపింది. పదో తరగతి పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించిన కీర్తిని పాఠశాల ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితులు అభినందించారు.
ఎస్సీ గురుకులాల్లో చిత్తూరు జిల్లా టాప్- మంత్రి మేరుగు నాగార్జున
ఎస్సీ గురుకులాలకు చెందిన పదవ తరగతి విద్యార్థులలో రాష్ట్రవ్యాప్తంగా 69 శాతం మంది ఉత్తీర్ణతను సాధించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. జిల్లాల వారీగా చూస్తే చిత్తూరు జిల్లాకు చెందిన గురుకులాలు టాప్ లో ఉన్నాయని, ఆ జిల్లాకు చెందిన గురుకులాల విద్యార్థులు శాతం 92 ఉత్తీర్ణతను సాధించారన్నారు.
రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో నాగార్జున డా.బీ.ఆర్.అంబేద్కర్ ఎస్సీ గురుకులాలకు చెందిన విద్యార్థులు సాధించిన ఫలితాలను మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 185 గురుకులాల ద్వారా మొత్తం 13,649 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలను రాయగా వారిలో 9435 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. గురుకుల విద్యార్థుల ఉత్తీర్ణత 69 శాతం ఉన్నప్పటికీ కొన్ని జిల్లాలకు చెందిన గురుకులాలు రాష్ట్ర సగటు ఉత్తీర్ణత కంటే అత్యధిక శాతం ఉత్తీర్ణతను సాధించగలిగాయని తెలిపారు.
చిత్తూరు జిల్లాకు చెందిన గురుకులాలు 92శాతం, పార్వతీపురం జిల్లాలోని గురుకులాలు 88శాతం, నంద్యాల జిల్లాకు చెందిన గురుకులాలు 86 శాతం, ప్రకాశం జిల్లాకు చెందిన గురుకులాలు 82 శాతం ఫలితాలను సాధించాయని నాగార్జున పేర్కొన్నారు. వైయస్సార్ కడప, శ్రీకాకుళం, నెల్లూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు, బాపట్ల జిల్లాలకు చెందిన గురుకులాలు 70శాతం పైబడి ఫలితాలను సాధించాయన్నారు. ప్రకాకాశం జిల్లా మార్కాపురం లోని బాలికల గురుకులం, చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు, రామకుప్పం బాలుర గురుకులాలు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చోలంగిపేట బాలికల గురుకులాలు పదోతరగతి పరీక్షల్లో 100శాతం ఉత్తీర్ణతను సాధించాయని తెలిపారు. 99%, 98% ఫలితాలను కూడా పలు గురుకులాలు సాధించాయని చెప్పారు. కాగా ఎస్సీ హాస్టళ్లకు చెందిన విద్యార్థులలో అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యార్థులు 86 శాతం, శ్రీకాకుళం విద్యార్థులు 70 శాతం ఫలితాలను సాధించారన్నారు. ఎస్సీ హాస్టళ్లకు చెందిన విద్యార్థులలో 8263 మంది పదవ తరగతి పరీక్షలకు హాజరు కాగా వారిలో 4095 మంది ఉత్తీర్ణులు అయ్యారన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
పదో తరగతి పరీక్ష ఫలితాలు వాయిదా
తొలుత ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు వాయిదా పడ్డాయి. శనివారం ఏపీ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో ఫలితాలను సోమవారానికి వాయిదా వేశారు. సాంకేతిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అనివార్యంగా ఫలితాలు వాయిదా వేసినట్లు వెల్లడించారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆశ్చర్యానికి గురయ్యారు. సీఎం కార్యాలయ ఆదేశాలతో ఫలితాలు వాయిదా పడ్డాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ దేవానంద్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
చివరి నిమిషంలో జరిగిందిదీ..
పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా పడడానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారుల మధ్య సమన్వయ లోపమే కారణమని తెలుస్తోంది. మంత్రి బొత్సకు సమాచారం ఇవ్వకుండా అధికారులే ఫలితాల ప్రకటన చేసినట్లుగా సమాచారం. దీంతో అధికారులు తీరుపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నట్టుండి ఫలితాలను వాయిదా వేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టెన్త్ స్టూడెంట్స్ ఫెయిల్ కాదు..సర్కారు ఫెయిల్యూర్- నారా లోకేష్
విడుదలైన టెన్త్ ఫలితాల్లో విద్యార్థులు ఫెయిల్ కాలేదని, జగన్ రెడ్డి ప్రభుత్వం విద్యావ్యవస్థని భ్రష్టు పట్టించి పరీక్షల నిర్వహణలో ఫెయిల్ అయ్యిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. టెన్త్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో 71 స్కూళ్లలో ఒక్కరూ ఉత్తీర్ణులు కాకపోవడం, 20 ఏళ్లలో అతి తక్కువగా 67.26 శాతం ఉత్తీర్ణత నమోదు కావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌రెడ్డి తాను పదో తరగతి కష్టపడి చదివి పాసై ఉంటే, విద్యార్థుల కష్టాలు తెలిసేవని ఎద్దేవ చేశారు. పరీక్షలు నిర్వహించడం దగ్గరనుంచి ఫలితాలు ప్రకటించేవరకు అంతా అస్తవ్యస్తం, గందరగోళమేనన్నారు. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుల్ని నాడు-నేడు పనులకి కాపలా పెట్టడంతో వారు పిల్లలకి చదువు చెప్పడం మానేసి ఈ పనుల్లో నిమగ్నమయ్యారన్నారు. నాడు నేడు అంటూ కోట్ల రూపాయలతో ప్రచారం చేసుకుంటోన్న జగన్‌రెడ్డి 3500 కోట్లు దోచేశారని, నాడు (2018) టిడిపి ప్రభుత్వం నిర్వహించిన టెన్త్ పరీక్షల్లో 94.48 శాతం ఉత్తీర్ణత సాధిస్తే, నేడు 67.26 శాతం దిగజారడమేనా వైసీపీ ప్రభుత్వం సాధించిన ప్రగతి అని ప్రశ్నించారు.
2016 -94.77%
2017 -91.9%
2018 -94.4%
2019 -94.8%
2020 -రద్దు
2021 -రద్దు
2022 -67%
బెండపూడిలో పదేళ్లుగా ప్రసాద్ అనే టీచర్ ఎన్నారైల సహకారంతో విద్యార్థినులను అమెరికన్ ఇంగ్లీషులో మాట్లాడేలా తీర్చిదిద్దితే, ఆ ఘనత తన ఖాతాలో వేసుకున్న సీఎం..టెన్త్ దారుణ ఫలితాలు కూడా తన ఖాతాలోనే వేసుకోవాలన్నారు. ఈ మూడేళ్లలో ఒక్క కొత్త టీచర్‌ని కూడా వేయకపోవడం వల్ల విద్యార్థులకి చదువు చెప్పేవారే లేక ఫలితాలు దారుణంగా వచ్చాయన్నారు.
పరీక్షల వేళ విపరీతమైన కరెంటు కోతలు, పరీక్షా సమయం కుదింపు, పేపర్ లీక్, మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్‌లతో విద్యార్థులు మానసికంగా బాగా దెబ్బతిన్నారని, ఈ కారణాలు కూడా ఫలితాలపై ప్రభావం చూపాయన్నారు. అమ్మ ఒడి ఇవ్వడానికి నిధుల్లేక-అప్పులు దొరక్క ఇప్పటికే వాయిదాలు వేసుకుంటూ వచ్చిన ప్రభుత్వం లబ్ధిదారులను తగ్గించే కుట్రలో భాగంగానే టెన్త్ ఫలితాల్లో అత్యధికుల్ని ఫెయిల్ చేసిందనే అనుమానాలున్నాయన్నారు. ఒక్కరూ పాస్ కాని పాఠశాలలు 71 ఉన్నాయంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం అవుతోందన్నారు. ఇది విద్యార్థులు ఫెయిల్ కావడం కాదు అనీ, ఇది ముమ్మాటికీ ప్రభుత్వం ఫెయిల్యూర్ అని ఆరోపించారు.
పరీక్షలు ఎందుకు వాయిదా వేశారు.. సమాధానం చెప్పాల్సిందే: అచ్చెన్న
ఏపీలో పదో తరగతి పరీక్షల వాయిదాపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిందని అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలను వాయిదా వేయడంపై అచ్చెన్న తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కోర్టు వాయిదాలకు అలవాటు పడి పడి.. పరీక్ష ఫలితాలు వాయిదా వేస్తే ఎలా జగన్ అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో పాఠశాలల సంఖ్య తెలుసా అని అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 10వ తరగతి పరీక్ష ఫలితాలు వస్తాయని 6 లక్షల మంది విద్యార్థులు ఎంతో ఆశతో ఎదురు చూశారన్నారు. అయితే, ఫలితాలను ఎందుకు వాయిదా వేశారో విద్యార్థులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముందు పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని చెప్పి, చివరి నిమిషంలో వాయిదా వేయటం ఏంటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. పరీక్ష ఫలితాల వాయిదా అధికారులు, మంత్రి మధ్య సమన్వయ లోపమా? లేక జగన్ ప్రభుత్వ చేతకానితనమా అని దుయ్యబట్టారు. విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసమర్థ పాలనతో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతారా అని నిలదీశారు. మద్యం వ్యాపారం చేసుకునే వ్యక్తిని.. విద్యా శాఖ మంత్రిగా ఇలాగే ఉంటుందని బొత్స సత్యనారాయణపై అచ్చెన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో విద్యా ప్రగతి పూర్తిగా దిగజారినట్టుగా ఉంది : గంటా
‘‘పదో తరగతిలో కేవలం 67 శాతం ఉత్తీర్ణులు కావడం, 71 పాఠశాలల్లో నూరు శాతం ఫెయిల్ కావడం…చూస్తుంటే రాష్ట్రంలో విద్యా ప్రగతి పూర్తిగా దిగజారినట్టుగా ఉంది. ఆంధ్రను నిరక్షరాస్య రాష్ట్రంగా చేస్తామని ఎన్నికల్లో ఏమైనా హామీ ఇచ్చారా?’’ అని విద్యా శాఖ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. . ‘‘విద్యా రంగంలో ఏటా సుస్థిర, గణనీయమైన ప్రగతి సాధించిన చరిత్రను పాతరేశారు. నాణ్యమైన విద్యనందించడంలో మొదటి నుంచి మూడో స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని, చివరి నుంచి మూడో స్థానానికి దిగజార్చారు’ అని విమర్శించారు. ఒక డీఎస్సీ లేదు, ఓరియంటేషన్ లేదు, ప్రణాళిక లేదు.. అని ఆరోపించారు. విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు విద్యా శాఖ మాజీ మంత్రిగా తన సహకారం కావాలంటే అందించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
ఫలితాల వాయిదాపై విద్యార్థి సంఘాల ఆందోళన
పదో తరగతి పరీక్షా ఫలితాల వాయిదాపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు కూడా ప్రణాళిక ప్రకారం విడుదల చేయలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. మంత్రి, అధికారుల మధ్య సమన్వయం లేదని ఫలితాలు వాయిదా వేయడం ఏమిటని ప్రశ్నించారు. ర్యాంకులు ప్రకటిస్తే.. జరిమానా అని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇప్పుడు అర్ధంతరంగా ఫలితాలు వాయిదా వేశారని తెలిపారు. మరి అధికారులు, ప్రభుత్వానికి ఎటువంటి జరిమానా వేయాలని నిలదీశారు. ఆరు లక్షల మంది జీవితాలతో ఆడుకుంటారా… దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.