దేశవ్యాప్తంగా ప్రధానంగా ఐదు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపంచడంతో కేంద్రప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ ఐదు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాలకు లేఖ రాసింది. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో స్థానికంగా కరోనా వ్యాప్తి అధికమైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ భావిస్తోంది.
కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణ పై తీసుకున్న చర్యలన్నీ వృధాకాకుండా అన్ని రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి మరింత ఉద్ధృతం కాకుండా కట్టుదిట్టమైన కార్యాచరణ రూపొందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖలో పేర్కొన్నారు. అందరూ కలిసి కట్టుగా పనిచేస్తేనే కరోనాను నియంత్రించగలమని, ఇందులో ఏదైనా సహాయం కావాల్సి వస్తే చేసేందుకు కేంద్ర ఆరోగ్య, శిశు సంక్షేమ శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు.
కాగా, దేశంలో వెల్లడైన కొత్త కేసుల్లో కేరళలోనే అత్యధికంగా నమోదయ్యాయి. దేశం మొత్తం మీద కేరళలో 31.14 శాతం కొత్త కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో, దేశంలో నమోదైన కొత్త కేసుల్లో 1.78 శాతం తెలంగాణలో నమోదయ్యాయి.