ఏపీ సీఎం వైఎస్.జగన్ ఆదేశాలతో ప్రభుత్వ పథకాలు పొందే లబ్ధిదారులకు పథకం ఫలాలు నేరుగా ఇంటి వద్దకే చేరుతున్నాయి. అర్హులైన ప్రతీపేదవాడికి ప్రభుత్వం పలు రకాల పథకాలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా వృద్ధులకు, వితంతువులకు ప్రతీ నెల 1న వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరుతో ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోంది. ఇప్పటికే పలు పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి వలంటీర్లు అందిస్తున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుకను కూడా వలంటీర్లు ఇంటి వద్దకే వెళ్లి అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం తెల్లవారుజాము నుంచే వైయస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమం మొదలైంది. సూర్యుడు కూడా రాక ముందు నుంచే వలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలోని 60.75 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల కోసం ప్రభుత్వం రూ.1543.80 కోట్లను విడుదల చేసింది. వలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా జరిగింది.
ఉదయం 7.00 గంటల వరకు 30.01 శాతం పెన్షన్ల పంపిణీ ద్వారా సుమారు 18.22 లక్షల మందికి రూ.461.92 కోట్లు అందజేశారు వలంటీర్లు. అలాగే.. ఉదయం ఎనిమిది గంటల వరకు 48.27 శాతం పెన్షన్ల పంపిణీ, 29.32 లక్షలమందికి రూ.744.02 కోట్ల అందజేసినట్లు, అదే విధంగా ఉదయం 9:00 గంటల వరకు 58.52 శాతం పెన్షన్ల పంపిణీ.. 35.55లక్షల మందికి రూ.902.60 కోట్లు, ఉదయం 10:00 గంటల వరకు 66.15 శాతం పెన్షన్ల పంపిణీ.. 40.18 లక్షల మందికి రూ.1020.68 కోట్లు అందచేసినట్టు డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ముత్యాల నాయుడు తెలిపారు.
ఏపీ ప్రభుత్వం పేదవర్గాల ప్రజలకు మేలుచేసేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ఇంటింటికి రేషన్ కార్యక్రమంతో పాటు, ఇంటింటికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు గ్రామ వలంటీర్లు నేరుగా ఇంటివద్దకే వచ్చి నగదు అందజేస్తున్నారు. పెన్షన్లు అందుకునే వారిలో వృద్ధులే అధికంగా ఉంటారు. వీరు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ తీసుకోవాలంటే గతంలో మండల కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ వలంటీర్లు నేరుగా ఇంటివద్దకు వచ్చి పెన్షన్ డబ్బులు అందిస్తుండటంతో సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మెహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
@YSRCParty తెల్లవారుజాము నుంచే వైయస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ. రాష్ట్రంలోని 60.75 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల కోసం రూ.1543.80 కోట్లు విడుదల.- ఉదయం 10:00 గంటల వరకు 66.15 శాతం పెన్షన్ల పంపిణీ.. 40.18 లక్షల మందికి రూ.1020.68 కోట్లు అందచేత #YSRPensionKanuka