కర్ణాటక లో ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ పై కొందరు నిరసనకారులు నల్ల సిరాతో దాడి చేశారు. వేదిక వద్ద బీజేపీ ప్రభుత్వం తనకు తగిన భద్రత కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం మద్దతుతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు.
కర్ణాటకలో ఓ రైతు నాయకుడు డబ్బులు తీసుకుంటున్నట్లు ఇటీవల రహస్య నివేదికలో వెల్లడైంది. దీంతో టికాయత్, ఆయన అనుచరులకు వ్యతిరేకంగా కొంతకాలంగా రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్టింగ్ ఆపరేషన్ గురించి మాట్లాడేందుకు టికాయత్ సోమవారం బెంగళూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టికాయత్ మాట్లాడుతుండగా.. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన వద్దకు దూసుకొచ్చారు. ముఖంపై నల్ల సిరా ను చల్లారు. దీంతో టికాయత్ అనుచరులు, రైతు నేతలు నిరసకారులపై ప్రతిదాడికి దిగారు. పరస్పరం కుర్చీలతో దాడి చేసుకున్నారు. దీంతో ఈ కార్యక్రమం కాస్తా రసాభాసగా మారింది.ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ, కుర్చీలతో కొట్టుకుంటూ భయానక వాతావరణాన్ని సృష్టించారు.
కాగా, ఈ ఘటనపై టికాయత్ స్పందించారు. కర్ణాటక బీజేపీ ప్రభుత్వం తనకు తగిన భద్రత కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులతో తనకు భద్రత ఏర్పాటు చేయలేదన్నారు. ప్రభుత్వంతో కుమ్మక్కయిన కొన్ని శక్తులే ఈ దాడికి పాల్పడ్డాయని ఆరోపణలు చేశారు.