బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాథ్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. అనంతరం ఆయన అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆయనను సీఎంఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కేకే మరణించినట్టు ధ్రువీకరించారు.ఆయన మరణం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రముఖ గాయకుడు కేకే మరణం పట్ల బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నటుడు అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. తన కెరీర్ లో కేకే కూడా ఒక భాగమని, తనకు సంబంధించి ఎన్నో పాటలకు స్వరాన్ని అందించాడని బాధపడ్డారు. అతడు ఆలపించిన తూ బోలా జైసే పాట వల్లే ఎయిర్ లిఫ్ట్ మూవీ క్లైమాక్స్ చక్కగా వచ్చిందని, గత రాత్రి జరిగిన ఘటన నిజంగా షాకింగ్ గా ఉంది’’అని పేర్కొన్నాడు. ఈ ఏడాది గాయకులు లతా మంగేష్కర్, సిద్ధూ మూసేవాలా, కేకే దూరం కావడం పట్ల అక్షయ్ స్పందిస్తూ.. ‘‘ఇది ఎంతో బాధాకరమని, ఎంతోమంది గాయకులను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు.అది కూడా యుక్త వయసులోనే’’అని పేర్కొన్నారు.
ఆయన గాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయని గాయకుడు పాపాన్ అంగారాగ్ ట్వీట్ చేశారు. దేవుడు ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
కేకే మరణవార్త వినాల్సి రావడం విషాదకరమని, జీవితం ఎంత దుర్భలమైందో ఆయన మరణం మరోమారు గుర్తు చేసిందని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్టు పేర్కొన్నాడు.