ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. కేంద్రంలో ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా లో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని ఆయన అన్నారు. గతంలో కంటే తమ పరిపాలనలో సరిహద్దు ప్రాంత ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు. అనంతరం… గరీబ్ కల్యాణ్ సమ్మేళన్ సహా పలు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో స్వయంగా ఆయన ముచ్చటించారు. వారి మనోభావాలను అడిగి తెలుసుకున్నారు. 130 కోట్లమంది భారతీయులకు సేవ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు.
స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన నాయకులు కన్న కలలు సాకారం చేసే దిశగా అందరం కలిసికట్టుగా పని చెయ్యాలని పిలుపునిచ్చారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేంద్రప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని దేశ ఉజ్వల భవిష్యత్తుకు మనవంతు సహాయ సహకారాలు అందింద్దాం అంటూ ప్రధాని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 11వ విడత నిధులు విడుదల చేశారు. దీనిద్వారా 10 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఏర్పాటు చేసిన గరీబ్ కల్యాణ్ సమ్మేళన్‌లో పాల్గొన్న ఆయన.. అక్కడ నుంచి దేశవ్యాప్తంగా రైతులతో వర్చువల్‌గా ముఖాముఖి నిర్వహించారు.ఇందులో భాగంగా రైతుల సమస్యలు, కేంద్ర పథకాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో పధకాల వల్ల తాము ప్రయోజనం పొందామని పలువురు మహిళలు, రైతులు తమ అభిప్రాయాలను ప్రధానితో పంచుకున్నారు.