పశ్చిమ గోదావరి : పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో రైతు పరిస్థితి దయనీయంగా మారింది. దాళ్వా సీజన్‌లో రెక్కలు ముక్కలు చేసుకున్న పండించిన పంటను ప్రభుత్వానికి విక్రయిస్తే పైసా కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం సార్వా సాగుకు సిద్ధం కావడానికి సాగు నీరు ఇస్తారో లేదో ప్రశ్నార్ధకం. చేతిలో పైసా పెట్టుబడి లేక.. పంటకు నీరందుతుందో లేదో తెలియని పరిస్థితుల్లో రైతులు పంట విరామం యోచనలో ఉన్నారు. వేసవిలో కాల్వలు మూసివేసిన తర్వాత చేపట్టాల్సిన పనులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కొద్దిపాటి పనులు చేయడానికి కాంట్రాక్టర్లు రాలేదు. మరోవైపు పంట భూముల్లో మురుగును తరలించే డ్రెయిన్లలో గుర్రపు డెక్క, తూడుకు పేరుకుపోయి నీరు కదలని పరిస్థితి నెలకొంది. దీనితో సార్వా సీజన్‌లో వరి సాగుకు నీటి లభ్యతపై అనుమానంతో పాటు వర్షాలు, వరదలు సంభవిస్తే ముంపు నీరు తొలగక నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కాల్వ మరమ్మతులకు మంగళం
ప్రభుత్వ తీరు పంట కాల్వల అభివౄద్ధి పనులకు మంగళం పాడినట్లు ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాళ్వా సీజన్ పంట మాసూళ్ల అనంతరం కాల్వ మూసివేత నాటికి కాల్వల అభివౄద్ధి, మరమ్మతు పనులకు ప్రభుత్వం నిర్దిష్ట కార్యాచరణ చేపట్టలేదని, పూర్తిస్థాయి నిధులు విడుదల చేయలేదని ప్రధాన ఆరోపణ. అరకొర నిధులు విడుదల చేసినా పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్లు వెనుకంజ వేయడంతో పనులు చేపట్టలేదు. సెంట్రల్ డెల్టాకు విడుదలైన నీరు ప్రధాన పంట కాల్వల నుంచి అనుబంధ కాల్వల ద్వారా చేలకు అందే పరిస్థితి లేదు. పలు చోట్ల కాల్వలు పూడుకుపోయాయి, లాకులు శిథిలావస్థకు చేరాయి. కాల్వ గట్లు జారిపోతున్నాయి. పనులు చేపట్టడంపై ప్రభుత్వం శ్రద్ధ వహించకపోవడంతో వేసవి ముగిసింది. జూలై 1 న కాల్వలకు నీరు విడుదల చేశారు. దీనితో కాల్వ పనులు చేపట్టకుండానే సార్వా సీజన్ ఆరంభమైంది. అదే సమయంలో రుతు పవనాల రాకతో వర్షాలు ప్రారంభమయ్యాయి. మురుగు డ్రెయిన్ల ద్వారా నీరు పారే అవకాశం లేకపోవడంతో పంటలు మునుగుతాయని రైతుల్లో ఆందోళన మొదలైంది.
ఆందోళన ఆరంభం
పశ్చిమ గోదావరి జిల్లా పూర్తి డెల్టా ప్రాంతమైనా పంట నీరందని పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. గోదావరి చెంతనే ఉన్న సిద్ధాంతం వద్ద దొంగరావి పాలెం అరటి తోటలు, పసుపు పంట ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన బాట పట్టారు. జూలై 1న కాల్వలకు నీరు విడుదల చేసినా ఆచంట-1 కాల్వకు రెండు వారాలకు కూడా చుక్క నీరు రాకపోవడంతో పంటలు ఎండుతున్నాయని రైతులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. మరోవైపు పెనుమంట్ర మండలం జీ అండ్ వీ కెనాల్‌కు అనుబంధంగా ఉన్న నేలపోగుల కాల్వకు నీరు చేరిన తర్వాత మరమ్మతు పనులు చేపట్టారు. నీరున్న కాల్వలో యంత్రంతో మట్టి పూడిక తొలగింపు పనుల చేపట్టడం విస్మయం కలిగిస్తోంది. చేసిన పనిలో నాణ్యత ఉంటుందా.. నిబంధనల మేరకు పనులు జరుగుతాయా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. నీటిలో చేపట్టిన పనులు ఎలా లెక్క కడతారు. చెల్లింపులు ఏవిధంగా చేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏమాత్ర వరద వచ్చినా.. గట్టిగా వర్షం వచ్చినా ముందుగా నీట మునిగే ఆచంట, యలమంచిలి మండలాల రైతులకు సాగు ఆరంభంలో పంటకు అవసరమైన నీరందని పరిస్థితి నెలకొంది. ఉండి, ఆకివీడు, మొగల్తూరు మండలాల పరిధిలో కాల్వలు అభివౄద్ధి జరగకపోవడంతో సాగు నీరందని పరిస్థితితో పాటు ఎక్కడికక్కడ తూడు పేరుకుపోయిన డ్రెయిన్లతో వర్షాకాలం ముంపు తప్పదని రైతులు భావిస్తున్నారు. అంతకంటే ముందు ధాన్యం సొమ్ము అందకపోవడంతో పెట్టుబడి లేక సాగు చేపట్టడానికి రైతులు దిక్కులు చూస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పంట విరామం మేలని రైతులు భావిస్తున్నారు.