తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ-కాంప్లెక్స్‌లోని అన్ని క్యూలైన్లు నిండిపోయాయి. ప్రస్తుతం క్యూలైన్లలో భక్తులు టీటీడీ ఆస్థాన మండపం వరకు వేచియున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 48 గంటలకు పైనే సమయం పడుతోంది. భక్తుల రద్దీ నేపథ్యంలో తితిదే ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి మాట్లాడుతూ వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉందని, శ్రీవారి దర్శనం అయ్యే వరకు ఓపికగా వేచి ఉండేలా ఏర్పాట్లు చేసుకుని రావాలని ఆయన సూచించారు. కరోనా పరిస్థితులతో సుమారు రెండేళ్లుగా చాలా మంది భక్తులు తిరుమల రాలేకపోయారన్నారు. అందుకే ఇప్పుడు రద్దీ ఎక్కువగా ఉందన్నారు. .. భక్తులకు అవసరమైన ఆహారం, నీరందించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. టీటీడీ అధికారులు, ఉద్యోగులు బ్రహ్మాండంగా పనిచేస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి
తిరుమల శ్రీవారిని పెట్రోలియం & సహజ వాయువు, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు. అనంతరం కేంద్రమంత్రికి తితిదే ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ 1987 నుంచి తాను తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నట్లు చెప్పారు. స్వామి దర్శనంతో కొత్త ఉత్సాహం, స్ఫూర్తి లభించాయన్నారు.
దర్శనానికి దాదాపు 48 గంటల సమయం
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ఏకాదశి, గరుడ సేవ లాంటి పర్వదినాల కంటే ఎక్కువ మంది భక్తులు విచ్చేశారు. దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది. శ్రీవారి ఆలయంలో గంటకు 4,500 మంది భక్తులకు మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉంది. భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం చేయించేందుకు 48 గంటల సమయం పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేయడమైనది. ఇటువంటి అనూహ్యమైన రద్దీ సమయంలో విఐపిలు కూడా తిరుమల యాత్ర విషయం పునరాలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని టిటిడి కోరుతోంది.
భక్తుల క్యూలైన్ల తనిఖీ
టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తిరుమలలో భక్తులు వేచి ఉన్న క్యూలైన్లను పరిశీలించారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నామని ఈఓ తెలిపారు. పోలీసులు, విజిలెన్స్, టిటిడిలోని అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలియజేశారు.