తిరుమల తిరుపతి దేవస్థానం వారసత్వ అర్చకుల నియామకపు విషయంలో కోర్ట్ తీర్పులను సాకుగా చూపించటం మాని తిరిగి వారసత్వ అర్చకులను విధుల్లోకి తీసుకోని వారికీ తగిన బాధ్యతలు అప్పగించాలని రమణ దీక్షుతులు టీటీడీని డిమాండ్ చేసారు.
ఏంటి వారసత్వం ఏంటి వారి ఘనత ?
రమణదీక్షితులు డిమాండ్ చేస్తున్నట్టు వారసత్వపు అర్చకులను ఎందుకు తిరిగి పునర్నియామకం జరపాలి ఏంటి వారికున్న ప్రత్యేకత అనే సందేహం మనకు కలుగక మానదు దీని పరిశీలించాలంటే చరిత్రలోకి వెళ్లాల్సిందే…తిరుమల హిందూ పుణ్యక్షేత్రంగా 15 వందల ఏళ్ల పైగా చరిత్ర ఉంది. మొట్ట మొదటగా, వైఖానస అర్చకుడు గోపీనాథ దీక్షితులు (శ్రీ వేంకటాచల మహాత్యం అనుసరించి), శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరిణి చెంత, చింత చెట్టు క్రింది చీమల పుట్టలో కనుగొని, శ్రీవారి మూర్తిని ప్రస్తుతం వున్న ప్రదేశంలో ప్రతిష్ఠించి, అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అప్పటి నుండి గోపీనాథ దీక్షితుల యొక్క వంశీయులే పరంపరగా స్వామి వారి పూజా కైంకర్యాల నిర్వహణ చేస్తున్నారు. వారి వారసులే రమణదీక్షితులు స్వామి ప్రధమంగా వారిచే కనుగొనబడి ప్రప్రధమంగా స్వామికి సేవలందించే భాగ్యం వారికే చెందినది కాబట్టి వంశ పారంపర్యంగా వారికీ ఈ భాగ్యం ఉండాలని వారు పోరాడుతున్నారు. స్వామి సేవకోసం మా పూర్వీకుల నుండి ఇప్పటివరకు తరతరాలు అంకితమయ్యామని స్వయానా ఆ స్వామి వారే మాకు ఆ భాగ్యం కల్పించారని రమణ దీక్షితులు చెప్తారు. ఐతే వారసత్వపు అర్చక కుటుంబాలుగా పైడిపల్లి గొల్లపల్లి పెద్దింటి తిరుపతమ్మ కుటుంబాల వ్యక్తులు తరతరాలుగా స్వామివారికి సేవను అందిస్తున్నారు అందులో రమణ దీక్షితులు గొల్లపల్లి కుటుంబ అనువంశిక అర్చకుడిగా ఉన్నారు.
సన్నిధి గొల్లలు ఎవరు.. ఆ వివాదం ఏంటి ?
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి ఆలయంలో ప్రతి కార్యక్రమం సంప్రదాయాలకు అనుగుణంగానే నిర్వహిస్తారు. ఇప్పటికీ పురాతన కాలంలో నిర్దేశించిన విధంగా స్వామివారి ఆలయంలో పూజా కైంకర్యాల నిర్వహణ జరుగుతుంది. ఆలయ పూజా కైంకర్యాలకు సంబంధించి అర్చకులు, జియ్యంగర్లు, ఆచార్య పురుషులు, అన్నమాచార్య వంశీకులతో పాటు సన్నిధి గొల్ల కుటుంబం పాత్ర ప్రతి నిత్యం ఉంటుంది. అసలు శ్రీవారిని ప్రతి నిత్యం ముందుగా దర్శించుకునే భాగ్యం సన్నిధి గొల్ల కుటుంబ సభ్యుడిదే. ఈ అవకాశం సన్నిధి గొల్ల కుటుంబీకులకు రావడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. స్వామివారు లక్ష్మీ అమ్మవారిని వెతుక్కుంటూ భూలోకానికి విచ్చేసిన సమయంలో పుట్టలో ఉంటారు. స్వామివారి ఆకలిని తీర్చడానికి బ్రహ్మపరమేశ్వరులు ఆవు, దూడ రూపంలో వస్తారు. పశువుల కాపరి వీటిని అడవికి తీసుకువెళ్ళిన సమయంలో ఆవు తన పాలను శ్రీవారికి అందిస్తుంది. ఇది గమనించిన పశువుల కాపరి ఆవును కొట్టబోయి శ్రీవారిని గాయపరుస్తారు. భూలోకంలో శ్రీవారిని మొదటగా చూసింది యాదవుడే కాబట్టి, అప్పటి నుంచి ప్రతిరోజు తన మొదటి దర్శనం వారికే అన్న వరాన్ని ఇచ్చారని పురాణాలు చెబుతున్నాయి. ఆ సంప్రదాయమే ఇప్పటికీ శ్రీవారి ఆలయంలో కొనసాగుతోంది. అందులో భాగంగానే సన్నిధి గొల్ల కుటుంబానికి వంశ పారపర్యంగా ఈ అవకాశాన్ని కల్పించారు. రాజులు.. బ్రిటీష్.. మహంతుల కాలం నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. శ్రీవారి ఆలయంలో వేకువజామున 2.30 నిమిషాలకు అర్చకులను తీసుకుని ఆలయ ద్వారాలు తీస్తారు సన్నిధి గొల్ల. దివిటీలతో దీపాలను వెలిగించి ముందుగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత సుప్రభాతసేవ మొదలవుతుంది. దాని తర్వాత శ్రీవారికి పూజా కైంకర్యాలను నిర్వహిస్తారు. తిరిగి ఉదయం, రాత్రి వేళల్లో నైవేద్య సమయంలోను అర్చకులను సన్నిధి గొల్ల తోడ్కొని వెళతారు. ఇక రాత్రి వేళ శ్రీవారి ఏకాంత సేవ పూర్తి అయిన తర్వాత ఆలయానికి తాళాలు వేసి జియ్యంగార్లు భద్రపరుస్తారు. ఇలా శ్రీవవారికి ఆలయంలో పూజా కైంకర్యాలు అనునిత్యం జరుగుతాయి. కానీ 1996లో రాష్ట్ర ప్రభుత్వం మిరాసీ విధానాన్ని రద్దు చేసింది. అప్పటివరకు అర్చకులు, సన్నిధి గొల్ల కుటుంబాలకు ఉన్న హక్కులు కోల్పోయారు. దీంతో సన్నిధి గొల్లలను ఉద్యోగులుగా మార్చేసింది తితిదే. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా మీరు అర్చకులు తరహాలో 65 ఏళ్ళు దాటింది కాబట్టి పదవీ విరమణ చెయ్యాలంటూ వారికి ఆదేశించింది తితిదే. గతంలో అర్చకులకు సంబంధించి మిరాసీ వ్యవస్థ రద్దవడంతో వారు కోర్టుకెక్కారు. ఈ వివాదం కొనసాగుతూనే ఉంది ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మధ్యే మార్గంగా 2006లో అర్చక కుటుంబీకులకు వంశపారపర్య హక్కులు కల్పించింది. దీంతో వివాదం సద్దుమణిగిందని అనుకుంటున్న తరుణంలో తిరిగి అర్చకులకు 65 సంవత్సరాల వయోపరిమితి విధించారు. దీనిపైనా అర్చకులు కోర్టుకెల్లడంతో తిరిగి వెనక్కి తగ్గిన తితిదే చివరికి వారు సాగినన్ని రోజులు కొనసాగించేలా నిర్ణయం తీసుకుంది. అప్పట్లో సన్నిధి గొల్లలకు సంబంధించి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. 2020 లో జగన్ ప్రభుత్వం గొల్ల మిరాశీ వ్యవస్థను తిరిగి పునరుద్దిరింపజేస్తూ తీసుకున్న నిర్ణయంతో సన్నిధి గొల్లలు మరలా వంశపారంపర హక్కులను కైవసం చేసుకున్నారు.
తిరుమల ప్రాశస్త్యం – అధికార పార్టీ అలసత్వం
తిరుమల కలియుగ పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతూ గత చరిత్ర ఆనవాళ్లను ఎన్నో వింతలను తనలో నిక్షిప్తం చేసుకుంది స్వయానా కలియుగంలో భక్తుల కష్టాలను తీర్చటానికి విష్ణు రూపం లో ఉన్న స్వామి వారు శ్రీ వెంకటేశ్వరుడిగా చిత్తూరు జిల్లా తిరుమలలో వెలిశారు. పల్లవులు, చోళులు పాండ్య రాజులు విజయనగర సామ్రాజ్య అధినేత శ్రీ కృష్ణదేవరాయలు ఆరాధించారని చరిత్ర చెప్తుంది. తొండమాన్ చక్రవర్తి ఆనంద నిలయాన్ని నిర్మించారని చెప్తారు. ఇది ఇలా ఉంటే జగన్ ప్రభుత్వం వారసత్వపు అర్చకుల విషయంలో సానుకూలంగా స్పందించినా ప్రభుత్వ ప్రత్యక్ష విధానం తో నడిచే టీటీడీ మాత్రం కోర్ట్ తీర్పులను సాకుగా చూపుతూ వారసత్వపు అర్చకులను విధుల్లోకి తీసుకోవటంలో అలసత్వం వహిస్తుందని రమణ దీక్షితులు ఆరోపించారు మరికొంతమంది జగన్ ఉద్దేశపూర్వకంగానే పైకి వారసత్వ అర్చకులను సమర్దించి తర్వాత టీటీడీ పేరు చెప్పి వారసత్వ అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకోనివ్వకుండా అడ్డు పడుతున్నారని. దీంతో విసిగిపోయిన రమణ దీక్షితులు ట్విట్టర్ వేదికగా తన బాధని వెళ్లగక్కరనే అభిప్రాయాలూ వినపడుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం టీటీడీ వ్యవహారాలను కంట కనిపెడుతూ హిందూ ధర్మాన్ని కాపాడాలని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
