ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అదేశాల మేరకు విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్‌లో గ్యాస్ లీకేజీ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. ఎస్ఈజెడ్‌లో ప్రమాద ప్రాంతాన్ని ఎమ్మెల్యే కన్నబాబు రాజు, ఎంపీ డాక్టర్ సత్యవతితో కలిసి మంత్రి అమర్‌నాథ్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఘటనా స్థలంలో కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. గ్యాస్ లీక్ ఘటనపై ఆరా తీశారు. మంత్రి అమర్‌నాథ్ మాట్లాడుతూ.. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించామని చెప్పారు. రెండు కంపెనీల్లో ఉద్యోగులు ఎక్కువగా అస్వస్థతకు గురయ్యారని, వారికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని వివరించారు. విష వాయువులు ఎక్కడ నుంచి వచ్చాయనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. ముందుగా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడం జరిగిందని, వారికి మంచి వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించామన్నారు. గ్యాస్ లీక్ ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులు కోలుకుంటున్నారని, పలువురు ఇళ్లకు కూడా వెళ్లిపోయారని చెప్పారు.
తాత్కాలికంగా అచ్యుతాపురం క్వాన్టం సీడ్స్ కంపెనీ మూసివేత…
అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్‌లోని సీడ్స్ కంపెనీ తాత్కాలికంగా మూసివేశారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చాక కంపెనీ తెరవాలని ఎమ్మెల్యే కన్నబాబురాజు ఆదేశాలు జారీ చేశారు. సీడ్స్ కంపెనీలో నిన్న 300 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. అనకాపల్లిలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.అచ్యుతాపురం బ్రాండిక్స్ కంపెనీ అస్వస్థతకు గురైన 151 మంది మహిళా కార్మికులకు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో రెండో రోజు చికిత్స కొనసాగుతుంది. మహిళా కార్మికుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. మహిళా కార్మికుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి డిస్ఛార్జ్ చేస్తామని వివరించారు. చికిత్స పొందుతున్న మహిళా కార్మికులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పరామర్శించారు. ఆస్పత్రి వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
గ్యాస్ లీకేజీ ఘటనపై కమిటీ
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్‌లో అమ్మోనియా గ్యాస్ లీకేజీ ఘటనలో కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఒకవేళ నిబంధనలు పాటించలేదని తేలితే సంబంధిత నిందితులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లోని సీడ్స్ వస్త్రపరిశ్రమల నుంచి వెలువడిన ప్రమాదకరమైన విషవాయువు వల్ల 300 మంది ఉద్యోగినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరో రెండు గంటల్లో విధులు ముగించుకొని ఇంటికి వెళ్లాల్సి ఉండగా.. శుక్రవారం మధ్యాహ్నం 12గంటలకు గాఢమైన విషవాయువు విడుదలైంది. దీంతో మహిళా కార్మికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కంపెనీలో పనిచేస్తున్న వారికి ఊపిరి అందకపోవడంతో ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. బయట వాతావరణంలో వాయువు మరింత వ్యాపించి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో కంపెనీ ప్రతినిధుల సూచన మేరకు లోపలికి వెళ్లిపోయారు. అక్కడ ఒక్కొక్కరు వాంతులు చేసుకుంటూ కింద పడిపోయారు. కొందరు స్పృహ తప్పిపోవడంతో కంపెనీలో ప్రాథమిక చికిత్స అందించారు. ఏ-షిఫ్ట్‌కు హాజరైన 2వేల మందిలో ఎక్కువమంది ఊపిరాడక ఇబ్బందిపడ్డారు. బాధితులను కంపెనీ అంబులెన్సులు, ఇతర వాహనాల్లో తొలుత అచ్యుతాపురానికి తరలించారు. అక్కడి ఆసుపత్రుల్లో సరైన వైద్యసేవలు అందక ఉద్యోగినులు ప్రత్యక్ష నరకం అనుభవించారు.12 గంటలకు ప్రమాదం జరిగినా ప్రభుత్వ యంత్రాంగం బాధితులకు చికిత్స అందించడానికి అచ్యుతాపురానికి ఒక్క వైద్యుడినీ పంపలేదు. రోడ్లమీద, మెట్ల మీద, కటిక నేలపైనా బాధితులు స్పృహతప్పి పడిపోతూ వైద్యసేవల కోసం ఆర్తనాదాలు చేస్తూ కనిపించారు. ఈ ప్రమాదంలో ఏడు నెలల గర్భిణులు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. వీరి చికిత్సల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లేవీ చేయకపోవడంపై పలువురు మండిపడ్డారు. ప్రమాదం జరిగిన 4గంటల తరువాత 120 మంది బాధితులను అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని అనకాపల్లిలోనే వివిధ ప్రైవేటు ఆసుపత్రిల్లో చేర్చారు. జిల్లా కలెక్టర్ రవి సుభాష్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, జిల్లా ఎస్పీ గౌతమి సాలి వచ్చి విత్తన కంపెనీని పరిశీలించారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏంటో ప్రకటించలేదు.
ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యం వీడలేదు : చంద్రబాబు
విశాఖలో విషవాయువు లీక్ ఘటన ఆందోళనకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన తరువాత కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడలేదని ధ్వజమెత్తారు. అచ్యుతాపురం సెజ్లో గ్యాస్ లీకైన ఘటనలో దాదాపు 200 మంది అస్వస్థతకు గురికావటం బాధాకరమన్నారు. విశాఖలో అతిపెద్ద విషాదంగా నిలిచిన ఎల్జీ పాలిమర్స్ ఘటన తరవాత కూడా పరిశ్రమల యాజమాన్యాలు, ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకోకపోవటం విచారకరమని తెలిపారు. అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం బాధితులను ఆదుకోవటమే కాకుండా నిర్లక్ష్యానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల పర్యవేక్షణ లోపం, వ్యవస్థల నిర్వీర్యం ప్రజల పాలిట శాపాలుగా మారుతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
కంపెనీ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలి : నారా లోకేష్
జగన్‌రెడ్డి ఆయన దోపిడీ గ్యాంగ్ ధనదాహంతో విశాఖపట్నం విషాదపట్నమైంది. అధికారంలోకొచ్చిన నుంచీ ఎల్జీ పాలిమార్స్, సాయినార్ ఫార్మా..నేడు బ్రాండిక్స్ సెజ్ లో ప్రమాదం. వరుస విషవాయువు లీక్ ఘటనలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్ లోని సీడ్స్ కంపెనీ నుంచి గ్యాస్ లీకై 200 మంది అస్వస్థతకు గురవడం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలి. గ్యాస్ లీక్ కి కారణమైన కంపెనీ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలి. విషవాయువులు ప్రజల ప్రాణాలు తీస్తున్నా ప్రభుత్వ స్పందన శూన్యం. పోయిన ప్రాణాలకి కోటి పరిహారం ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం కాదు సీఎం గారూ..! మరో ప్రాణం పోకుండా భద్రతాచర్యలు తీసుకున్నామని ఎందుకు చెప్పలేకపోతున్నారు అని …నారా లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రశ్నించారు.
ప్రభుత్వానిదే బాధ్యత : సీపీఐ
అచ్యుతాపురం గ్యాస్ లీకేజ్ ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో పదేపదే గ్యాస్ లీకేజీ దుర్ఘటనలు జరగడం ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం, పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులు, అధికారులపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
బ్రాండిక్స్ ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి- సిపిఎం
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లోని బ్రాండిక్స్ కంపెనీలో శుక్రవారం మధ్యాహ్నాం జరిగిన తీవ్ర ప్రమాదంపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేస్తున్నది. అస్వస్థకు గురైనవారికి మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలి. రాష్ట్రంలో ఇలాంటి ప్రమాదాలు పదే పదే జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఈ పరిశ్రమలను నిరంతరం పర్యవేక్షణ చేస్తూ భారీ పరిశ్రమల్లో భద్రతను పెంపొందించాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే అచ్యుతాపురంలో గ్యాస్ లీకేజీ : ఏపిసిసి
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అచ్యుతాపురంలో గ్యాస్ లీకేజీ జరిగిందని, బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా లో మళ్లీ విషవాయువు లీక్ ఘనట తీవ్ర ఆందోళన కలిగించిందని ఆయన అన్నారు. అచ్యుతాపురం సెజ్ లోని సీడ్స్ కంపెనీ నుంచి గ్యాస్ లీకైన ఘటనలో దాదాపు 200 మంది అస్వస్థతకు గురవ్వడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం బాధితులను ఆదుకోవడమే కాకుండా నిర్లక్ష్యానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని శైలజ నాథ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విశాఖలో ఎల్జీ పాలిమర్స్, చిత్తూరు పూతలపట్టులో హాట్సన్ డైరీలో అమ్మోనియా లీకేజీ, ఏలూరు పోరస్ కంపెనీలో గ్యాస్ లీకేజీ, నంద్యాలలో ఎస్పీవై ఆగ్రో ఇలా వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. పరిశ్రమల నిర్వహణలో ప్రభుత్వం చూపిస్తున్న అలసత్వం, తనిఖీలు సరిగా లేకపోవడమే కారణమని, ఈ రోజు అచ్యుతాపురం సెజ్ లో జరిగిన ప్రమాదానికి కూడా ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్షయమే కారణం అని ఆరోపించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, రసాయన ప్రమాదాల్లో వాయువులు బాధితులపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉన్నందున హెల్త్ కార్డులు అందించి విష వాయువుల ప్రభావం తగ్గేవరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.