అడవి శేషు కథానాయకుడిగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ‘మేజర్’ చిత్రం శుక్రవారం విడుదలైంది.బయోగ్రాఫికల్ యాక్షన్ డ్రామా గా తీసిన ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, శోభిత, సయీ మంజ్రేకర్, రేవతి కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ ‘మేజర్’ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం.
26/11 ఉగ్ర దాడుల్లో పౌరుల ప్రాణాలను కాపాడుతూ అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ‘మేజర్’ను తెరకెక్కించారు.సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులతో మాట్లాడి, సినిమా తీసేందుకు అనుమతి తీసుకుంది.‘చాలా మందికి ‘మేజర్’ సందీప్ ఎలా చనిపోయాడో తెలుసు. కానీ, ఎలా జీవించాడో తెలియదు’ అంటూ ఆ విషయాలన్నీ ఎంతో హృద్యంగా చూపించాలనే ఉద్దేశంతోనే ‘మేజర్’ తీశారు అడవి శేష్.ఈ సినిమాకు ‘మేజర్’, ‘మేజర్ సందీప్’ అనే టైటిల్స్ అనుకున్నారు. చివరకు మొదటిదాన్నే ఖాయం చేశారు. నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్‌చంద్రలు ఈ సినిమా గురించి అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబుకు చెప్పగా, ఆయన కూడా ‘మేజర్’ నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. తెలుగుతో పాటు, ఉత్తరాది రాష్ట్రాలకు చేరువయ్యేలా ఏకకాలంలో ఈ సినిమాను హిందీలోనూ తెరకెక్కించారు.‘మేజర్’ విడుదల సందర్భంగా చిత్ర బృందం వినూత్న ప్రచారానికి తెర తీసింది. ఎంపిక చేసిన నగరాల్లో కొంతమంది ప్రేక్షకుల కోసం ఈ సినిమాను ప్రదర్శించారు. విడుదలకు ముందే ప్రేక్షకుల కోసం ఓ సినిమాను ప్రదర్శించటం ఇదే తొలిసారి.ఈవిధంగా ‘మేజర్’ మూవీ జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది.