శైలజనాథ్ అరెస్ట్ ను ఖండించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
ఛలో అమలాపురం బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం ఉదయం చలో అమలాపురం కార్యక్రమానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రామవరప్పాడు రింగ్‌రోడ్డులో జగజ్జీవన్ రాం విగ్రహానికి ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ ఇతర నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం అమలాపురం బయలుదేరిన కాంగ్రెస్ నేతల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ కాంగ్రెస్ నేతల బృందాన్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
అంబేద్కర్ పేరును కోనసీమకు పెడితే నేరం అన్నట్లుగా కొంతమంది ప్రవర్తిస్తున్నారని శైలజానాథ్ మండిపడ్డారు. ప్రభుత్వం నెల తరువాత నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని విమర్శించారు. అంత మంది రోడ్ల మీదకు వచ్చే వరకు పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతల కుట్రతోనే విధ్వంసం జరిగిందని ఆరోపించారు. సామాజిక న్యాయ యాత్ర పేరుతో ఒరగ బెట్టిందేమిటని నిలదీశారు. అక్కడ దాడులు చేసి ఇక్కడ యాత్రలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్, యన్టీఆర్ పేర్లకు లేని అభ్యంతరం అంబేద్కర్ కే ఎందుకని ఏపీసీసీ చీఫ్ ప్రశ్నించారు.
అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు ఆపడం అన్యాయమన్నారు. ‘‘మనం దేశ సరి హద్దులో ఉన్నామా… ఏపీలో ఉన్నామా’’ అంటూ దుయ్యబట్టారు. అమలాపురం వెళ్లేందుకు తమకు ఆటంకాలు కలిగిస్తున్నారని, పోలీసులు ను అడ్డం పెట్టి అడ్డుకుంటున్నారని అన్నారు. తాము అమలాపురం వెళితే ప్రభుత్వానికే మేలు జరుగుతుందని తెలిపారు. అక్కడ సోదరులతో మాట్లాడి శాంతి కోసం ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చారు. ‘‘మమ్మలను ఆపితే… మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం’’ అని హెచ్చరించారు. ఆర్.యస్.యస్ భావజాలంతో ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉందన్నారు. తమను అమలాపురం వెళ్లనివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘ఇప్పుడు ఆపారు… మరోసారి తప్పకుండా వెళ్లి తీరుతాం’’ అని శైలజనాథ్ స్పష్టం చేశారు.
అమలాపురంకు వెళితే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందా?
ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించాలని, ఇతర రాజకీయ పార్టీల హక్కులను కూడా గౌరవించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. జగన్ అధికారంలోకి వచ్చాక మూడేళ్ల పాలనలో పోలీసులను ఉపయోగించి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీల నేతలు, దళిత సంఘాల నాయకులు అమలాపురం వెళితే శాంతి భద్రతల సమస్య ఉండదు కదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం పదేపదే తప్పులు చేస్తోందని ఆయన ఆరోపించారు.
అరెస్టును ఖండించిన సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఛలో అమలాపురం కార్యక్రమానికి బయలుదేరుతున్న కాంగ్రెస్, వి.సి.కె. తదితర పార్టీల నాయకులను విజయవాడలోనే అరెస్టు చేయడాన్ని సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటి ఖండించింది. అంబేద్కర్ పేరును వ్యతిరేకిస్తూ అరాచకం సృష్టించిన దుండగులను వదిలి సామాజిక న్యాయం కోసం గళం విప్పుతున్న నాయకులను అరెస్టు చేయడం అక్రమం. అరెస్టైన నాయకులు పిసిసి అధ్యక్షుడు ఎస్.శైలజానాథ్, కొరివి వినయ్‌కుమార్, వి.సి.కె. పార్టీనాయకులు విద్యాసాగర్ తదితరులను విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్‌లో సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పరామర్శించారు. స్టేషన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ అగ్రకుల దురహంకారాన్ని రెచ్చగొట్టి అరాచకం సృష్టించడానికి కారకులైన బిజెపి, సంఘ్ పరివారం కుట్రలను అర్ధం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోనసీమ జిల్లాకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరును కొనసాగించాలని, ఒత్తిళ్ళకు లొంగితే సహించేది లేదని హెచ్చరించారు.