కృష్ణకుమార్ కున్నాత్ పేరు వింటే చాలు ఎన్నో హిట్ సాంగ్స్ గుర్తొస్తాయి. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. కేకే హఠాన్మరణంతో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ పాడి ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. కోల్ కతాలో ఒక షోలో ప్రదర్శన అనంతరం హోటల్ కి వెళ్లిపోయారు. అక్కడ ఆయనకు హార్ట్ ఎటాక్ రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అల్లు అర్జున్ కి ఎంతో పేరు తెచ్చిపెట్టిన ఆర్య మూవీలో ఫీల్ మై లవ్ అనే పాట పాడారు. తర్వాత నా ఆటోగ్రాఫ్ మూవీలో గుర్తుకొస్తున్నాయి..7 జి బృందావన్ కాలనీలో తలచి తలచి సాంగ్ పాడారు. కృష్ణకుమార్ కున్నాత్ మరణం పట్ల సినీ జగత్తు యావతు నివాళి అర్పిస్తోంది.
‘ కేకే గా పేరు తెచ్చుకున్న ఫేమస్ సింగర్ కృష్ణకుమార్ కున్నాత్ అకాల మరణం విచారం కలిగిస్తోంది. ఆయన పాటల్లో ఎన్నో అద్భుతమైన భావోద్వేగాలు పలుకుతాయి. అన్ని వయసుల వారిని ఆయన పాటలు అలరిస్తాయి. అందరి మనసులను తాకుతాయి. ఆయన సంగీత ప్రపంచానికి వదిలెళ్లిన పాటల ద్వారా మనం ఆయన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి ” అంటూ ప్రధానమంత్రి మోదీ ట్వీట్ చేశారు.