అర్జీల పరిష్కారం, సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనపై సీఎం దిశానిర్దేశం కోసం, విధి నిర్వహణలో దొర్లే పొరపాట్లను సరిదిద్దుకునే అవకాశాన్ని స్పందన కార్యక్రమం కల్పిస్తోందని సీఎం జగన్ తెలిపారు. స్పందన అర్జీల పరిష్కారంపై అన్ని స్థాయిల్లో అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం సూచించారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో స్పందన కార్యక్రమంపై క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ సమీక్షించారు.
గడపగడపకూ.. కార్యక్రమం కింద ప్రతి ఎమ్మెల్యే నెలలో 10 సచివాలయాలను సందర్శిస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్తున్నారు. ప్రభుత్వం చేసిన కార్యక్రమాలే కాకుండా ప్రజల సమస్యలనూ తెలుసుకుంటారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో కలిసి సమస్యలు తెలుసుకుంటారు. ఇది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం. ప్రతి ఇంటికి చేకూరిన లబ్ధిని తెలియజేస్తారు. ఎమ్మెల్యేల వద్దకు వచ్చే సమస్యలను పరిష్కరించడంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి.
స్పందనను మనమే స్వచ్ఛందంగా చేపడుతున్నామని గుర్తుచేస్తూ సమస్యలను పరిష్కరించాలన్న తపన ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఐఏఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులంతా మన ఎస్‌డీజీ సూచికల వైపే చూస్తున్నారని ప్రస్తావిస్తూ మన కలెక్టర్లు దేశంలోనే అత్యుత్తమమని గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ..
ఉపాధి హామీ పనులు, గ్రామవార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్స్, ఏఎంసీయూ, బీఎంసీయూ, వైయస్సార్ డిజిటల్ లైబ్రరీలు, వైయస్సార్ అర్బన్ క్లినిక్స్, ఇళ్లపట్టాలు, హౌసింగ్, జగనన్న భూహక్కు భూరక్ష, స్పందన, ఖరీఫ్ సన్నద్ధత, జాతీయ రహదారులు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు భూసేకరణ అంశాలపై సమీక్ష చేశారు. .
ఉపాధి హామీ
ఉపాధి పనులకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాలను దాదాపుగా అన్ని జిల్లాలు చేరుకున్నాయి. రోజువారీ వేతనం కనీసంగా రూ.240లు వచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. కలెక్టర్లు, జేసీలు, పీడీసీలు, ఎంపీడీఓలు ఉపాధిహామీ పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి, తనిఖీలు చేయాలి. దీనివల్ల పనుల్లో నాణ్యత కనిపిస్తుంది. రుతుపవనాలు ముందస్తుగా వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు. దీనివల్ల వ్యవసాయ పనులు కూడా ఊపందుకుంటాయి. ఈ మేరకు అన్ని పరిస్థితులనూ సమన్వయం చేసుకుంటూ ఉపాధి హామీ పనులకు సంబంధించి ప్రత్యామ్నాయ ప్రణాళిక కూడా సిద్ధం చేసుకోవాలి. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైయస్సార్ విలేజ్ క్లినిక్స్, బీఎంసీలు, ఏఎంసీలు.. వీటన్నింటినీ త్వరగా పూర్తిచేయాలి. జిల్లాకలెక్టర్లు పూర్తిగా వీటిపై ధ్యాసపెట్టాలి. పూర్తికాని భనాలను వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి. ఇందులో జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదు అన్నారు. వీటి నిర్మాణాల విషయంలో వెనకబడిన జిల్లాల కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షణ చేసి తమ పనితీరును మెరుగుపరుచుకోవాల్సి ఉందన్నారు.
హౌసింగ్
– కొన్ని లే అవుట్లకు పెండింగ్‌లో ఉన్న అప్రోచ్ రోడ్లను, ల్యాండ్ లెవలింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలి దీనికి కావాల్సిన నిధులను మీకు ఈ వారంలోనే అందుబాటులోకి తీసుకు వస్తున్నాం. సుమారు రూ.700 కోట్ల నిధులను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. దీనివల్ల ఇక్కడ కూడా ఇళ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలి, నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కింద ఏప్రిల్ 28న విశాఖపట్నంలో లాంచ్ చేశాం. విశాఖపట్నంలో 1.24 లక్షల ఇళ్లు, రాష్ట్రవ్యాప్తంగా 1.79 లక్షల ఇళ్లను మంజూరుచేశాం. ఇక్కడ ఇళ్ల నిర్మాణం వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
– కనీసంగా ప్రతినెలా 75వేల ఇళ్లు పూర్తయ్యేలా ప్లాన్ చేసుకోవాలి.
– కరెంటు, తాగునీటి సౌకర్యం, డ్రైన్లు ఈ సదుపాయాలన్నీకూడా కాలనీల్లో ఏర్పాటు చేయాలి. వీటికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి.
– కోర్టుల కేసుల కారణంగా పంపిణీకాని ఇళ్లపట్టాల విషయంలో సీఎస్, సంబంధిత శాఖాధికారులు ఉన్నస్థాయిలో సమీక్షచేస్తారు ఏ స్థలాలు న్యాయపరంగా సంక్లిష్టంగా ఉన్నాయో.. వాటిపై ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేస్తారు. కేస్ బై కేస్ పరిశీలించి, సమీక్షించి.. వాటిపై ప్రణాళిక సిద్ధంచేస్తారు:
– 90 రోజుల్లోగా ఇళ్లపట్టాల పంపిణీకి సంబంధించి కొత్తగా లబ్ధిదారులుగా గుర్తించిన 2,11,176 మందిలో 1,12,262 మందికి పట్టాలు పంపిణీ, ఇంకా 4,718 మందికి పట్టాలు ముద్రిస్తున్నారు, వీరికి త్వరలోనే ఇస్తారు. మిగిలిన 98,914 మందికి అవసరమైన భూమిని వీలైనంత త్వరగా గుర్తించి పట్టాలు పంపిణీచేయాలి. టిడ్కో ఇళ్లకు సంబంధించి పనులు నాణ్యంగా ఉండాలి:
మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు ఉండకూడదు. ఈ నెలాఖరు నాటికి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలి.
జగనన్న భూ హక్కు మరియూ భూరక్ష పథకం
జగనన్న భూ హక్కు మరియు భూరక్ష పథకం విప్లవాత్మకమైనది. గడచిన 100 ఏళ్ల తర్వాత చేపడుతున్న సమగ్ర సర్వే ఇది. నిర్దేశించుకున్న లక్ష్యంలోగా సర్వే పూర్తిచేయాలి. సమగ్ర సర్వే కింద చేపట్టాల్సిన ప్రక్రియకు సంబంధించి నిర్దేశించికున్న గడువులు కలెక్టర్లకు చదివి వినిపించిన సీఎం.ఈ గడువును ప్రతి కలెక్టర్ నోట్ చేసుకోవాలన్న సీఎం. ఆ గడువులోగా ఈ పనులు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. సమగ్ర సర్వేపై ఎప్పటికప్పుడు సమీక్షచేసుకుని, లక్ష్యాలను అనుకున్న విధంగా చేరుకుంటున్నామో లేదో కలెక్టర్లు చూసుకోవాలి. ప్రతివారం దీనిపై సమీక్ష చేసుకుని ముందుకుసాగితేనే సమగ్ర సర్వే కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తిచేయగలం. రోజువారీగా కూడా సర్వే పనుల ప్రగతిని నివేదిక రూపంలో తెప్పించుకోవాలి . అప్పుడే అనుకున్న గడువులోగా ఈ కార్యక్రమాలను పూర్తిచేయగలం
మహిళా, శిశు సంక్షేమాన్ని తీసుకుంటే గోరుముద్ద, సంపూర్ణ పోషణ కార్యక్రమంపై పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నాం. గతంలో రూ.500 – రూ.600 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు మనం రూ.1800 – రూ.1900 కోట్లు వెచ్చిస్తున్నాం. దీన్ని సమర్ధంగా వివరించాల్సిన అవసరం ఉంది. విద్య, వైద్య రంగాల్లో చేపడుతున్న పనులను మరింత విస్తృతంగా ప్రచారం చేయాలి. మూడేళ్లలో నేరుగా నగదు బదిలీతో పారదర్శకంగా రూ.1.41 లక్షల కోట్లు లబ్ధిదారులకు అందించాం.
ఈ స్థాయిలో డీబీటీ మరే రాష్ట్రంలోనూ లేదు. ఒక్క బటన్ నొక్కడం ద్వారా ఎలాంటి వివక్షకు తావులేకుండా అందించాం. జాతీయస్థాయిలో ప్రత్యేక ముద్ర వేయగలిగాం. దేశవ్యాప్తంగా ఐఏఎస్‌లు, ఉన్నతాధికారులంతా మన ఎస్‌డీజీ సూచికల వైపే చూస్తున్నారు. వీటన్నింటితో మన కలెక్టర్లు దేశంలోనే ఉత్తమమని గుర్తింపు పొందాలి. మీరే నా కళ్లూ, చెవులు. మీ పనితీరే .. నా పనితీరు, మనందరి పనితీరు.
మరింత సమర్థంగా..
స్పందన చాలా ప్రాధాన్యం కలిగిన కార్యక్రమం. దీన్ని మరింత సమర్థంగా, మెరుగ్గా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి సీఎస్ ఇప్పటికే జీవో ద్వారా మార్గదర్శకాలు స్పష్టంగా తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సాధన చాలా ముఖ్యమైన అంశం. స్పందన, ఎస్‌డీజీల ఆధారంగా మీ పనితీరు మదింపు ఉంటుంది.
ఇరిగేషన్ ప్రాజెక్టులకు భూసేకరణ
రాష్ట్రంలో ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఇంకా పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్‌పై కార్యాచరణ సిద్ధంచేయండి. వీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టండి.
జూన్ లో చేపడుతున్న కార్యక్రమాలు
జూన్ 7న రైతన్నలకు 3800 ట్రాక్టర్లు సహా 5వేలకు పైగా వ్యవసాయ యంత్రాల పంపిణీ. జూన్ 14న పంటల బీమా పరిహారం చెల్లింపు. జూన్ 23న అమ్మ ఒడి.