గడపగడపకు మన ప్రభుత్వం పేరిట నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న వైసిపి నాయకులకు ప్రజల నుండి వ్యతిరేకత వస్తోందని అందువల్లే పోలీసుల రక్షణలో బస్సు యాత్రకు సిద్దమయ్యారని ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. రాష్ట్రంలో బీసీ నాయకులతో బస్సు యాత్ర చేపడతామన్న వైసిపి పార్టీ ప్రకటనపై ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. ఏ మొహం పెట్టుకుని వైసీపీ నేతలు బస్సు యాత్ర చేస్తారని నిలదీసారు. ప్రస్తుతం గడపగడకు కార్యక్రమంలో ప్రజలు వైసీపీ నేతలను ఎలా నిలతీస్తున్నారో బస్ యాత్రలో అలాగే ప్రశ్నించాలని పద్మశ్రీ సూచించారు.
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు నవరత్నాల పేరుతో ఇంటింటికి తిరిగి మరీ వైసిపి నాయకులు ఇలాగే హామీలు ఇచ్చారని పద్మశ్రీ గుర్తు చేసారు. అయితే ఈ మాటలు నమ్మిన ప్రజలు అధికారాన్ని కట్టబెడితే ఇచ్చిన హామీలన్నిటింని మరిచారు. ఇప్పటివరకు ఎన్ని హామీలను సక్రమంగా అమలు చేశారు? అని ప్రశ్నించారు. సీఎం పదవిని చేపట్టగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధ్వంసంతో పాలన స్టార్ట్ చేశారని ఇలాగే మూడేళ్ల పాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని కాంగ్రెస్ నాయకురాలు మండిపడ్డారు.
ఎన్నికలకు మళ్లీ సమయం దగ్గరపడుతుంటంతో వైసిపి నాయకులు గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్నారని అన్నారు. కానీ ఏ గడపలోనైనా వైసీపీ నేతలను సాదరంగా ఆహ్వానించారా? అని అడిగారు. ఇలా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో పోలీసుల అండతో ఇప్పుడు బస్ యాత్ర చేపట్టడానికి వైసిపి నాయకులు సిద్దమయ్యారని పద్మశ్రీ ఆరోపించారు.
దావోస్ లో జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సు పేరుతో సీఎం జగన్ ప్రజాధనంతో ప్రత్యేక విమానంలో కుటుంబసమేతంగా విహారయాత్రకు వెళ్ళారు. గత సీఎంలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గగ్గోలు పెట్టిన జగన్ ఇప్పుడు చేస్తోంది ఏంటి? అని సుంకర పద్మశ్రీ నిలదీసారు..ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తానంటూ ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనలు చేస్తున్నారు. అయినా ఏపీకి పెట్టుబడులు రావడం లేదన్నారు. ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. జగన్ అరాచకానికి ప్రపంచ బ్యాంకు కూడా వెనక్కి వెళ్ళిపోయిందని పద్మశ్రీ పేర్కొన్నారు.
25 మంది ఎంపిలను ఇవ్వండి… కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తాన్న వైఎస్ జగన్ మాటలను పద్మశ్రీ గుర్తుచేసారు. కానీ అధికారంలోకి వచ్చాక ఏనాడైనా తన ఎంపీలతో కలిసి ప్రత్యేక హోదా కోసం స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్ళారా? పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళారా? కానీ తన పార్టీకే చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజును మాత్రం సస్పెండ్ చేయాలని వైసీపీ ఎంపిలను స్పెషల్ విమానంలో ఢిల్లీ పంపారని పద్మశ్రీ మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో వున్నారని ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ తిరుబాటు మొదలైందని పేర్కొన్నారు. ఇక ముఖ్యమంత్రి జగన్ మాటలను ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదని… వైసిపి నాయకులకు తగిన బుద్ది చెప్పడం ఖాయమన్నారు.