ఏపీలో ముందస్తు ఎన్నికలపై అధికారికంగా ఎలాంటి సంకేతాలు లేకున్నా విపక్షాలు మాత్రం సన్నద్ధమైపోతున్నాయి. ఎన్నికలు ఎంత త్వరగా జరిగితే అంత మంచిదని భావిస్తున్న విపక్షాలు.. ఈ మేరకు వైసీపీపై ఒత్తిడి పెంచేందుకు సిద్దమవుతున్నాయి.
అధికార వైసీపీ ఇదే వ్యూహాలు రచిస్తోందా..? ఆరు నెలల ముందే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారా..? రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే వస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి గెలవాలంటే తప్పకుండా ముందస్తు ఎన్నికలు వెళ్లాల్సిందే అన్న భావనలో వైసీపీ అధినేత జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు రాజకీయ సలహాలు ఇస్తున్న పీకే టీమ్ కూడా ఇదే మార్గం మంచిదని సూచించినట్లు సమాచారం.
ఇటీవలి కాలంలో టీడీపీ క్రమంగా బలపడుతుండడం.. మహానాడు, బాదుడే బాదుడు వంటి కార్యక్రమాలతో పాటు చంద్రబాబు పర్యటనలకు భారీ స్థాయిలో జనాదరణ లభిస్తుండడంతో…జగన్ టీమ్‌లో ఓటమి భయం ఆవహించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందస్తు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో కేసీఆర్ అనుసరించిన విధానాన్నే పాటిస్తూ.. షెడ్యూల్ కన్నా ఆరు నెలల ముందే ఎన్నికలకు వెళ్లాలని.. వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దానికి సన్నాహకంగా ఈ నవంబర్ నుంచి బస్సు యాత్ర చేపట్టాలని అనుకుంటున్నట్లు సమాచారం.
ఏపీలో ముందస్తు ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు సిద్ధమైపోతున్నాయి. రెండేళ్ల తర్వాత జరగాల్సిన ఎన్నికలకు వైసీపీ పూరించిన సమరశంఖంతో ప్రత్యర్ధి పార్టీలైన టీడీపీ, జనసేన కూడా అప్రమత్తమైపోయాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోరాడేందుకు సిద్ధంగా ఉండాలంటూ తమ క్యాడర్ కు నిత్యం సంకేతాలు పంపుతున్నాయి. దీంతో ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఎన్నికల సమరశంఖం పూరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు మరింత జోరందుకుంటున్నాయి.
చంద్రబాబు జిల్లాల టూర్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్ధితుల్లో వైసీపీని ఎట్టిపరిస్ధితుల్లోనూ ఓడించి తీరాల్సిందేనని టీడీపీ పట్టుదలగా ఉంది. ఈ ముూడేళ్లలో వైసీపీ చేతిలో ఎదుర్కొన్న అవమానాలు, దాడులు, కేసులతో టీడీపీతో పట్టుదల మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉండాలని చంద్రబాబు తన క్యాడర్ కు ఏడాది కాలంగా సూచిస్తూనే ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వెలువడుతుండటంతో జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపధ్యంలో జిల్లాల టూర్ కు శ్రీకారం చుడుతున్నారు.
పవన్ బస్సుయాత్ర
వాస్తవంగా ఎన్నికలకు రెండేళ్ల గడువు ఉన్నా అధికార వైసీపీ చేస్తున్న హడావిడితో జనసేన అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జిల్లాల టూర్ కు సిద్ధమవుతున్నారు. దసరా నుంచి జిల్లాల్లో బస్సుయాత్ర చేపట్టాలని జనసేనాని పవన్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలు కూడా పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేలా పవన్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ
దేశ వ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారంలో వాస్తవం లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు. వైసీపీ ప్లీనరీ తర్వాత ఆరు నెలల ముందుగానే ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం ముమ్మరమైందన్నారు. ప్రజలు రాజకీయ నాయకులను ఐదేళ్ల కోసం ఎన్నుకుంటారని, ఎన్నికలు ముందుగా నిర్వహించటం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందని వెల్లడించారు. ముందస్తు ఎన్నికల ప్రచారంతో ప్రజలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయి అసలు సమస్యలు పక్కదారి పడతాయన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య, రాష్ట్రాల అప్పులపై చర్చలు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రపతి ఎన్నికలలో తమ అభ్యర్దిని గెలిపించేందుకు కావాల్సిన పూర్తి మెజారిటీ బీజేపీకి లేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో గెలిచేందుకు బీజేపీకి వైసీపీ మీద ఆధారపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చుకునేందుకు వైసీపీకి ఇది సరైన సమయమని చెప్పుకొచ్చారు. బీజేపీని ప్రత్యేక హోదా దిశగా ఒత్తిడి చేసి సాధించటంతో ద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని జేడీ లక్ష్మీ నారాయణ చెప్పుకొచ్చారు.