ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా క్లినికల్ ట్రయిల్స్ జరిగేలా చూడాల్సిన బాధ్యత మనందరి పై ఉందని, అందుకు అనుగుణంగా హైదరాబాదులోని సీడీటీఎల్ (సెంట్రల్ డ్రగ్స్ లేబొరేటరీ) సేవలను ఆంధ్రప్రదేశ్ కు కూడా అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలుగు రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వాలకు చెందిన డ్రగ్ కంట్రోల్ అధికారులతో సమావేశమయ్యారు.
రాష్ట్రంలోని డ్రగ్ విభాగ సిబ్బందికి కేంద్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించాలని కోరారు. సమన్వయంతో పని చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. హైదరాబాదులోని సీడీటీఎల్ సేవలను ఏపీకి పూర్తి స్థాయిలో అందించాలని కోరారు. బ్లడ్ బ్యాంకుల్లో సురక్షిత రక్తం అందేలా చొరవ చూపాలని, హెచ్ఐవీ రోగులకు చెందిన రక్తం ఊసే ఎక్కడా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. క్లినికల్ ట్రైల్స్ సమయంలో డీసీజీఐ అధికారులు స్థానికంగా ఉండే రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా సమాచారం అందించాలని చెప్పారు. దీనివల్ల క్లినికల్ ట్రయిల్స్ విషయంలో లోపాలు లేకుండా నివారించవచ్చని చెప్పారు.
ప్రపంచస్థాయి నైపుణ్యం పొందేలా రాష్ట్రాల్లోని డ్రగ్ విభాగం అధికారులకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) తో శిక్షణ ఇప్పించాలని కోరారు. హైదరాబాదులోని సీడీటీఎల్ ఇకపై ఏపీకి కూడా సేవలు అందిస్తుందని డిప్యూటీ డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఎ.రామకృష్ణన్ వివరించారు. రాష్ట్రంలోని అధికారులతో పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుంటూ పని చేస్తామన్నారు.